School Bus Crushed 3 Year Old Girl: ‘అన్నా సాయంత్రం త్వరగా వచ్చేయ్ బోలెడ్ ఆటలు ఆడుకుందాం’ అంటూ ఎంతో ముద్దుముద్దుగా ఆ చిన్నారి చెప్పిన మాటలే చివరి మాటలవుతాయని ఎవరూ ఊహించలేదు. రోజూ మాదిరిగానే అన్నయ్యపై ఎనలేని ఇష్టంతో తనని బస్సు ఎక్కించేందుకు వెళ్లిన మూడేళ్ల చిట్టి చెల్లెలు ఆ బస్సు చక్రాల కిందే పడి నలిగిపోయిన తీరు చూసి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవాపురానికి చెందిన కోర్పు నరసయ్యదొర, శైలజ దంపతులకు కుమారుడు గీతాన్స్, కుమార్తె హన్సికా చౌదరి(3) సంతానం. గీతాన్స్ కోరుకొండలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. గురువారం ఉదయం తన అన్నయ్యను పాఠశాలకి పంపించేందుకు తల్లితో పాటు చెల్లెలు హన్సిక సైతం బస్సు ఎక్కించేందుకు వచ్చింది.
అయితే ఈ విషయాన్ని హన్సిక తల్లి శైలజ గమనించలేదు. కుమారుడిని బస్సు ఎక్కించిన తరువాత, ఇంటివైపు తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే శైలజ వెనక్కి తిరిగి చూసేసరికి, హన్సిక బస్సు చక్రాల కిందపడి విలవిల్లాడుతోంది. ఆ దృశ్యం చూసి భీతిల్లిపోయిన శైలజ, పరుగెత్తుకొని వెళ్లే సరికే పాప నుజ్జునుజ్జు అయింది.