SC ST Atrocity Case On YSRCP MLA Candidate Thota Trimurthulu :డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుతో పాటు ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
SC, ST Atrocity Case on YSRCP MLC Thota Trimurthulu :పోలింగ్ జరిగిన సోమవారం రాత్రి వల్లూరులో వైఎస్సార్సీపీ, కూటమి పార్టీల నాయకుల మధ్య జరిగిన ఘర్షణలు చిలికిచిలికి గాలివానలా మారాయి. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదుతో మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో పాటు మరికొందరు తనను కులం పేరుతో దూషించి, మారణాయుధాలతో దాడి చేశారని ఆ గ్రామ సర్పంచి దాసి మీనాకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వల్లూరులో ఉద్రిక్త వాతావరణం - జనసేన నేత వేగుళ్ల లీలా కృష్ణ అరెస్టు - Vegulla leela Krishna Arrest
త్రిమూర్తులు, ఆయన తనయుడు పృథ్వీరాజ్, నేమాని రాజశేఖర్, చోడే శ్రీకృష్ణ, దేవళ్ల రుద్రయ్య చౌదరి, దేవళ్ల రామలింగ చౌదరి, ముత్యాల సతీష్కుమార్లతో పాటు మరికొందరి పేర్లను అందులో పేర్కొన్నారు. రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ సంఘటన స్థలంలోనే ఉన్నా గొడవ సద్దుమణిగించడానికి ప్రయత్నించలేదని ప్రస్తావించారు. దీంతో ఫిర్యాదులో పేర్కొన్న ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అంగర ఎస్సై అందే పరదేశి తెలిపారు.