SANKRANTI RUSH: పెద్ద పండుగ రాకతో పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. శని, ఆది వారాలు కలసి రావడంతో ఉద్యోగులు కొలువులకు సెలవులు పెట్టేశారు. కష్టజీవులు పనులకు విరామం చెప్పేసి, పండుగకు రెండ్రోజులు ముందే సొంతూళ్లకు బయల్దేరుతున్నారు. పట్నం వీడి పల్లెలకు చేరుకునేవారి సంఖ్య భారీగా ఉండటంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
రైల్వేస్టేషన్లలో పడిగాపులు:సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమవడంతో తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడంతో శుక్రవారం నుంచే ప్రయాణ ప్రాంగణాలకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాదు నుంచి ఏపీకి వచ్చే వారి వాహనాలతో ఎన్టీఆర్ జిల్లా- నందిగామ వద్ద జాతీయ రహదారి సందడిగా మారింది. ప్రధాన పట్టణాల్లో బస్టాండ్లన్నీ నిండిపోతున్నాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అదనపు బస్సులు నడుపుతున్నా బస్సులు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. రైల్వేస్టేషన్లలోనూ ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.
హైదరాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్లలోనూ ఇదే పరిస్ధితి ఉంటోంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తోన్న రైళ్లన్నీ ఎప్పుడో నిండిపోగా ఇప్పుడు ఊరెళ్లే వారికి ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి. దక్షిణ మధ్య రైల్వే కూడా 56 ప్రత్యేక రైళ్లను ప్రకటించినా రైళ్లు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రత్యేక రైళ్లు, జనరల్ బోగీలు పెంచాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.