Early Sankranti Celebrations 2025 Start in AP : రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థినులు సందడి చేస్తున్నారు. రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొస్తున్నారు. పలుచోట్ల మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయ ప్రాంగణాన్ని ఉద్యోగులు రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. సచివాలయంలోని వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు ముగ్గులు వేశారు. ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించుకునే ఉద్యోగులు ఈసారి కూడా అదే ఉత్సాహంతో రంగురంగుల ముగ్గులు వేసి పోటీల్లో పాల్గోన్నారు. వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు వేసిన ముగ్గులను ఉత్తమమైనవి ఎంపిక చేసి బహుమతులు అందించనున్నట్టు ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల సంఘం తెలియజేసింది. మరోవైపు వివిధ రంగవల్లులతో ఏపీ సచివాలయం వర్ణశోభితమైంది. గంగిరెద్దులు కూడా విచ్చేసి పండుగ శోభను ముందే సచివాలయానికి తెచ్చాయి.
ముందుగానే సంక్రాంతి శోభ - హరిదాసుల కీర్తనలు - రంగురంగుల ముగ్గులు
విశేషంగా ఆకట్టుకున్న ప్రదర్శనలు : కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి జడ్పీ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. గుంటూరు జిల్లా నంబూరులోని VVIT ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సాంప్రదాయ వస్త్రధారణతో వివా పాఠశాల విద్యార్థులు అలరించారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు, గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.