Sammakka Sarakka Jatara 2024: గతంలో మేడారం జాతరకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన, ఎడ్ల బండ్లపై తల్లుల దర్శనానికి వచ్చేవారు. ఇప్పటికీ పరిసర ప్రాంత ప్రజలు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుండగా, ఏళ్లు గడిచేకొద్దీ సౌకర్యాలు పెరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు భక్తులను జాతరకు చేరుస్తున్నాయి. పెరుగుతున్న రద్దీ కారణంగా భక్తుల కోసం రాష్ట్ర పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు దేవతలను దర్శించుకుని, గగన విహారం చేస్తూ జాతర తిలకిస్తూ ఆనందంగా గడిపే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది.
మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు
Helicopter Services for Medaram Jatara 2024 : హైదరాబాద్, హనుమకొండ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మేడారం వరకు హెలికాఫ్టర్ సర్వీసులను నడుపనున్నారు. ఇందులో ప్రయాణించే వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. మేడారం పరిసరాల అందాలను వీక్షించేందుకు భక్తుల కోసం ప్రత్యేకంగా మేడారంలో హెలికాఫ్టర్జాయ్ రైడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సేవలందించిన ప్రైవేటు సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఈ సేవలను అందుబాటులోకి తెస్తుంది.
వరంగల్ నుంచి మేడారానికి వెళ్లి తిరుగు ప్రయాణానికి రూ.28 వేల 999 రూపాయలు, మేడారంలో జాయ్ రైడ్ కోసం రూ.4,800 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ సేవలను కూడా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.