ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ర‌రాజ్యానికి ఉపాధ్య‌క్షుడుగా ఆంధ్రా అల్లుడు - ఇక మ‌న ఉష అమెరికా సెకండ్ లేడీ

ఆనందం వ్యక్తం చేస్తున్న కృష్ణాజిల్లా సాయిపురం గ్రామస్థులు -

Telugu Origin Usha Chilukuri
Telugu Origin Usha Chilukuri (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 9:15 AM IST

Telugu Origin Usha Chilukuri : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ విజయకేతనం ఎగరేసింది. అధ్యక్షుడిగా ట్రంప్‌ కొలువుదీరనుండగా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌ ఆశీనులు కానున్నారు. అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు వాన్స్‌ ఆంధ్రా అల్లుడు కావడం అందులోనూ మన కృష్ణాజిల్లా మగువ ఉషా చిలుకూరి భర్త కావడంతో ఇక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ఉషా పూర్వీకులది ఉయ్యూరు మండలం సాయిపురం కాగా ఆమె తల్లిది పామర్రు. అమెరికాలో హోరాహోరీగా సాగిన ఎన్నికల బరిలో దిగిన వాన్స్‌ వెన్నంటి నిలిచి ప్రచారంలోనూ, ప్రత్యర్థులను ఢీ కొట్టడంలోనూ ఉషా సమర్థంగా వ్యవహరించారు. వాన్స్‌ చిరస్మరణీయ విజయంలో శక్తిమంతంగా సాగి నేడు అగ్రరాజ్యాన అ‘‘ద్వితీయ’’ మహిళగా కొలువుదీరనున్నారు.

"మా ఊరు, ఇంటి ఆడపడుచు ఆమెరికా ఉపాధ్యక్షుడి భార్యగా గుర్తింపు పొందడం నిజంగా ఆనందంగా ఉంది. మేం ముందే ఊహించాం. గెలుస్తారని అంచనా వేశాం. మా బంధువులు అంతా ఆమెరికాలోనే ఉన్నారు. ఈనెల 9, 10 తేదీల్లో గ్రామంలో అందరం కలిసి ఈ విషయంపై సంబరాలు చేయాలని నిర్ణయించాం. కార్తిక మాసం ప్రత్యేక పూజలు చేయనున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాం. కృష్ణా జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవడం చాలా సంతోషంగా ఉంది. విషయం తెలిసి మా కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచుకుని సంతోషించాం." - రామ్మోహన్‌రావు చిలుకూరి, సాయిపురం గ్రామం

"ఉషా చిలుకూరి పూర్వీకులు బుచ్చి పాపయ్యశాస్త్రి సాయిపురం వాస్తవ్యులే. వారి కుమారుడు రామభద్రశాస్త్రి ఇక్కడ నుంచి మార్కొండపాడు వెళ్లారు. వీరి బంధువులు ఇంకా మా ఊరిలోనే ఉన్నారు. మా గ్రామానికి చెందిన ఉషా భర్త వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్ష పదవిని అలంకరించడం ఆనందంగా గర్వంగా ఉంది. మా గ్రామస్థులు ఎందరో వివిధ రంగాల్లో స్థిరపడి అత్యున్నత స్థాయిలో ఉన్నారు." - జొన్నవిత్తుల వెంకటప్పయ్య, సాయిపురం

"అగ్రరాజ్యంలో సాయిపురం పేరు మార్మోగడం సంతోషం. ఉన్నత విద్యలో మేటిగా ఎదిగిన ఉషా ఎన్నికల వేళ భర్త వాన్స్‌ విజయానికి ఓర్పు, నేర్పుతో వెన్నంటి నిలిచారు. తెలుగింటి అమ్మాయిగా మా ఊరి ఆడపడుచుగా నారీమణులకు ఉషా స్ఫూర్తిగా నిలిచారు. భవిష్యత్తులో ఉషా సాయిపురాన్ని సందర్శిస్తే మా గ్రామం ఎంతో ఆనందపడుతుంది." - డి.కోమలి, సాయిపురం

"పామర్రు ప్రాంత మగువ కుమార్తె చిలుకూరి ఉషా అమెరికా సెకండ్‌ లేడీగా ఓ వెలుగు వెలిగి తెలుగు గడ్డకే వన్నె తెచ్చారు. ఆమె మహిళలందరికీ ఆదర్శంగా నిలవడం సంతోషదాయకం. ఆమె తల్లి పామర్రు ఆడపడుచు కావడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి మహిళ ఉషాను ఆదర్శంగా తీసుకోవాలి." - ఆర్‌.విశాలాక్షి, పామర్రు

"మా గ్రామంలో ప్రముఖ వంశానికి చెందిన మహిళ భర్త అమెరికాలో అత్యున్నత పదవిలో కొలువుదీరడం మాకు గర్వకారణం. మా గ్రామం పేరు ఆ స్థాయిలో వినపడటం మా అదృష్టంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో సాయిపురం అభివృద్ధిలో వాన్స్‌ సతీమణి ఉషా భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం." - బాషా, సర్పంచి, సాయిపురం

మిసెస్​ వైస్​ ప్రెసిడెంట్​ - బ్యూటీఫుల్‌ అంటూ ట్రంప్‌ కితాబు! ఇంతకీ ఎవరీ తెలుగమ్మాయి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగోళ్ల డిమాండ్లు- ఎవరు గెలిచినా ఆ పనులు చేయాల్సిందేనట!

ABOUT THE AUTHOR

...view details