RTC Authorities Said Will Provide Buses to Chilakaluripet Meeting: ప్రతిపక్షాల సభలకు ఇంత కాలం ఒక్క బస్సు కూడా ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికారులు ఇప్పుడు టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న భారీ సభకు బస్సులు ఇస్తామంటూ ముందుకొచ్చారు. ఎన్ని బస్సులు కావాలో చెప్పాలంటూ కబురు పంపారు. ఇంతకాలం వైసీపీ కబంధ హస్తాల మధ్య నలిగిన ఆర్టీసీ యంత్రాగం ఇక ఊపిరి పీల్చుకోనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టీడీపీ అధిష్ఠానం ఏ సభలు నిర్వహించినా బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ససేమిరా అంటూ ఉండేది. పూర్తి సొమ్ము ముందే చెల్లిస్తామని చెప్పినా, డిపో మేనేజర్లను కలిసినా మొండికేస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో టీడీపీ నేతల నుంచి డబ్బు తీసుకుని, తరువాత బస్సులు ఇవ్వబోమంటూ ఆ సొమ్ము వెనక్కి ఇచ్చిన ఘటనలు ఉన్నాయి.
17న చిలకలూరిపేటలో 3 పార్టీల తొలి బహిరంగ సభ - పాల్గొననున్న ప్రధాని మోదీ
చిలకలూరిపేటలో ఈ నెల 17న భారీ బహిరంగ సభను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ సభకు కూటమి శ్రేణులు తరలి వచ్చేందుకు వీలుగా బస్సులు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు తోడు భవిష్యత్ ఎలా ఉండబోతుందో అర్థమైన అధికారులు బస్సులు ఇచ్చేందుకు సమాయత్తమయ్యారు. ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇవ్వాలని కోరారు.