RSS Chief Mohan Bhagwat Visit Vijayawada :హిందువులను హిందువులే అవమానించుకోవడం, హిందూ ధర్మాన్ని కించపరిచేలా ప్రవర్తించడం తగదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందూ ధర్మాన్ని వారే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ పర్యటనలో భాగంగా మోహన్ భగవత్ ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను సందర్శించి స్వయం సేవక్‌లతో మాట్లాడారు. హిందూధర్మం ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు.
ఇతర మతాలు హిందూ ధర్మంలోని అంశాలను తమ విధానాల్లో అనుసరిస్తున్నాయని కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. హిందుత్వం, హిందూ ధర్మం, సనాతన పద్ధతులు, కుటుంబ వ్యవస్థ గురించి అంతా ఆలోచించాలని సూచించారు. దేశంలో సంతానం వృద్థి చెందాలని పునరుద్ఘాటించారు. దేశ జనాభా ఆందోళనకరమైన స్థితికి చేరకూడదని, కుటుంబాలు కనీసం ఇద్దరు మించి పిల్లలను కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే సమాజపు ఉనికి నిలుస్తుందని, జనాభాపరమైన సుస్థిరత అత్యవసరమని తెలిపారు.
భారత్‌ను ఒక ముప్పుగా చూపేందుకు బంగ్లాదేశ్‌లో కుట్ర : RSS చీఫ్
జనాభా తగ్గడం ఆందోళన కలిగించే అంశమని, ఏ వర్గానికి చెందిన వారైనా సంతానోత‌్పత్తి రేటు తగ్గిపోతే దాని ఉనికికే పెను ముప్పు అని ఆధునిక జనాభా అధ్యయనాలు చెబుతున్నాయని ఉటంకించారు. అందుకే ప్రతి ఫ్యామిలీకి కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలి. జనాభా శాస్త్రం చెప్పేది కూడా ఇదే అని మోహన్ భగవత్ గుర్తు చేశారు. 12 ఏళ్ల వరకు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటారని ఆ సమయంలోనే వారికి సంస్కారం, హిందుధర్మం, దేశం పట్ల గౌరవం, సనాతన జీవనం వంటివి ప్రభోధించాలని హితవు పలికారు. చిన్నతనం నుంచే దేశాభిమానం, సంఘటితత్వం, సమైక్య జీవన కాంక్షను రగిలించాలని అన్నారు.
అన్ని బాధ్యతలను ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించదని, సమాజ స్థితిగతులను పరిశీలిస్తూ కొన్ని మార్గాలను సూచిస్తుందని, ఆ దిశగా ఆచరించాల్సింది, ప్రయాణించాల్సింది ప్రజలేనని అన్నారు. ఈనెల 16వ తేదీ వరకు విజయవాడలోనే మోహన్ భగవత్ ఉంటారని సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా ఈ పర్యటన చేస్తున్నట్లు స్వయం సేవక్ సంఘ్ వర్గాలు తెలిపాయి. ఈనెల 11వ తేదీ రాత్రి విజయవాడ చేరుకున్న మోహన్ భగవత్ గురువారం, శుక్రవారం ఒక్కో శాఖను సందర్శించారు.
Mohan Bhagwat On Manipur : 'మణిపుర్ హింసలో విదేశీ శక్తుల హస్తం?'.. RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు