Roja Faces Opposition in Nagari Constituency:గడచిన రెండు ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన రీతిలో నగరి నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి రోజా ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజా అవినీతి, పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేక నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఇక పార్టీలో ఉన్నవారి నుంచి కూడా సహకారం కరవైంది. ఫలితంగా హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె ఆశ అడియాసలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తిరుమల కొండపై వైఎస్సార్సీపీ నేతల దందా - పవిత్రత గోవిందా - YSRCP Anarchists in Tirumala
నగరిలో రోజాకు వ్యతిరేక పవనాలు: తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నగరి నియోజకవర్గం పోరు ప్రతి ఎన్నికల్లోనూ రసవత్తరమే. ఇక్కడ గెలుపు ఓటములు దోబూచులాడుతూ చివరి రౌండు లెక్కింపు వరకు అభ్యర్థులను ఒత్తిడికి గురిచేస్తాయి. కానీ ప్రస్తుత ఎన్నికల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన మంత్రి రోజా మూడోసారి బరిలో నిలిస్తే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పోటీలో ఉన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంటే వైసీపీ కార్యకర్తలను నిస్తేజం ఆవరించింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు వ్యక్తి గతంగా రోజా మూటగట్టుకున్న అవినీతి ఆరోపణలు ఆమెను చుట్టుముట్టాయి. రోజూ పెరిగిపోతున్న వ్యతిరేక పవనాలను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.
పార్టీ క్యాడర్‌లో రోజాకు తీవ్ర వ్యతిరేకత: నగరి నియోజకవర్గంలో 2,01,607 ఓట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి రోజా, తెలుగుదేశం నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో 858 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో రోజా గట్టెక్కారు. 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అంటూ చేసిన అభ్యర్థనతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. నగరిలో మాత్రం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌పై 2,708 మెజార్టీతో రోజా బయటపడ్డారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి రోజా సోదరులు కుమారస్వామిరెడ్డి, రాంప్రసారెడ్డి, భర్త సెల్వమణి పెత్తనంతో పార్టీ క్యాడర్‌లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రతి పనికీ లంచాలు, కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారని సొంత పార్టీ నేతలే బహిరంగ వేదికలపై విమర్శలకు దిగారు.