Kakani Govardhan Reddy Land Scam: జగన్ జమానాలో వ్యవసాయ మంత్రిగా వెలగబెట్టిన ఆయన అధికారాన్ని తన సొంత పనుల కోసం వాడుకున్నారు. సాగుదారులకు చేసిందేమీ లేదు కానీ సొంత నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములను తీసుకొని అప్పనంగా తక్కువ ధరకే అల్లుడికి కట్టబెట్టారు. ఇవ్వకుంటే చిల్లిగవ్వా రాదంటూ బెదిరించారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు అంటే 2024 మార్చి 15న రాత్రికి రాత్రే ఈ దందా సాగించేశారు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్థనరెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక బాధితులు నోరు విప్పడంతో కాకాణి భూ దందా బయటకు వచ్చింది.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాల రైతులు సాగు చేసుకుంటున్న సీజేఎఫ్ఎస్(CJFS) భూములపై కాకాణి కన్నేశారు. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ భూముల విలువ మార్కెట్‌లో రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఈ భూములను తన అల్లుడి కంపెనీ కోసం అని చెప్పి కాకాణి తన అధికారాన్ని ఉపయోగించి రైతుల నుంచి లాగేసుకున్నారు. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ గ్రామంలో 122.13 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములున్నాయి. 1976లో అప్పటి ప్రభుత్వం 102 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకి ఈ భూములు ఇచ్చింది. ముళ్ల కంపలు, రాళ్లుతో ఉన్న ఈ భూములను పేద రైతులు బాగు చేసుకొని సాగులోకి తెచ్చి అపరాలు పండించేవారు.
55 ఎకరాల సరిహద్దులు గుర్తింపు - సజ్జల ఎస్టేట్‌లో కొనసాగుతున్న సర్వే
2007లో ఈ భూములను ఇళ్ల పట్టాల కోసం తీసుకోవాలని రెవెన్యూ శాఖ యత్నించినట్లు రైతులు తెలిపారు. అయితే వెంటనే రైతులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు రైతులకు అనుకూలంగా 2014లో తీర్పు వెల్లడించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చి, ఆపై మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈ భూములను తెలివిగా తన అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డి పరం చేశారు. ఎకరాకి రూ.15,62,142 రూపాయలు మాత్రమే రైతులకిచ్చారు. కుదరదన్న రైతులపై అధికార జులుం ప్రదర్శించారు. అసలు భూములు లాక్కుంటామని బెదిరించేసరికి సంతకాలు చేశామని రైతులు వాపోయారు.
కాకాణి అల్లుడి డొల్ల కంపెనీకి ఏపీఐఐసీ(APIIC) ఉన్నతాధికారులు ఒక్క రోజులో కోట్ల రూపాయల విలువైన భూములను అప్పగించేశారు. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఈ భూముల్లో ఎలాంటి ఏర్పాట్లు లేకపోయినా జీకేఎస్ ఇండస్ట్రియల్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇక్కడి భూములను బదలాయించారు. భూములు బదలాయిస్తూ జీవో 33 జారీ చేసింది. సర్వే నెంబర్ 2194-4, 2195-3, 2196-3, 2200-1, 2989-1, 2990-1, 2991-2, 2992లో ఈ భూములు ఉన్నాయి.
రోడ్డుకు ఆనుకుని ఉన్న, చదును చేసిన 57ఎకరాల భూమికి తక్కువ డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు బయటకు వచ్చి తమ సమస్యను అధికారులకు విన్నవించారు. తమ భూముల తిరిగి ఇప్పించాలని 8 నెలలుగా అడుగుతున్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
తిరుపతిలో బుగ్గమఠం భూములు స్వాహా - తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న దందాలు
జగన్ ప్రభుత్వంలో కేంద్ర పథకాల విధ్వంసం - వాటి విలువ ఎంతో తెలుసా?