Sindhanur Road Accident Today : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింధనూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో తుఫాను వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ సహా నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సింధనూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏపీకి చెందిన కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు.
Road Accident in Karnataka :మంగళవారం రాత్రి కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయల్దేరారని పోలీసులు తెలిపారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరిందని చెప్పారు. ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడిందన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు సుజేంద్ర, అభిలాష, హైవదన అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రాలయం పీఠాధిపతి సుబుదేందు తీర్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu on Sindhanur Accident : కర్ణాటక రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసుల మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు విద్యార్థుల మృతి తీవ్ర ఆవేదనను కలిగించిందని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.