Nagari Road Accident :చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరి వద్ద ఆదివారం రాత్రి తిరుపతి - చెన్నై రహదారిపై ఓ ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను నగరి ప్రభుత్వ ఆస్పుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమందిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు.
మృతులు వడమాలపేట సీతారామాపురానికి చెందిన పార్థసారథి నాయుడు (62), రాజేంద్రనాయుడు (60), తిరుపతికి చెందిన ధనుష్, తిరుత్తనికి చెందిన కుమార్‌గా గుర్తించారు. నగరి నుంచి తిరుపతి వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సీఐ మహేశ్వర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.