Road Accident in Kakinada District:పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. నవ మాసాలు మోసి కని పెంచిన తన ముగ్గురు కుమారులు తన కళ్లముందే విగత జీవులుగా రోడ్డుపై పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లి, మృతి చెందిన తన ముగ్గురు కుమారులను చూసి పడ్డ మానసిక క్షోభ హృదయ విదారకం.
ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి తీవ్ర గాయాలతో బయటపడగా, తన ముగ్గురు కుమారులను కోల్పోయిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గండేపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: భీమవరానికి చెందిన నంగలం దుర్గ (40) తల్లి, కుమారులు నంగలం రాజు (18), నంగలం యేసు (18), నగలం అఖిల్ (10) నర్సీపట్నంలోని కూలి పనులకు వెళ్లి ముగించుకొని వస్తున్నారు. ద్విచక్ర వాహనంపై నర్సీపట్నం నుంచి తమ సొంత గ్రామమైన భీమవరం మండలం తాడేరు గ్రామానికి వెళ్తున్నారు.