Road Accident in Anantapur District Today :నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వరూ ఊహించరు. మరీ ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం బాగానే వాహనం నడుపుతున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేని పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తున్నా కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవుతున్నారు.
తాజాగా అప్పటిదాకా ఆ యువకులంతా స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో సరదాగా గడిపారు. అందరితో కలిసి ఆనంద క్షణాలను ఆస్వాదించారు. అక్కడి నుంచి మరో మిత్రుడిని కలిసేందుకు బయల్దేరారు. కానీ అదేవారికి చివరిరోజు అవుతుందని వారికి తెలియదు. ఊహించని రోడ్డు ప్రమాదం వారిని విగత జీవులుగా మార్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
Rekulakunta Road Accident :శనివారం అర్ధరాత్రి బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా అనంతపురం స్టాలిన్నగర్కు చెందిన ముస్తాక్, ఓబులశెట్టి పవన్, శ్రీనివాసులు, వై.పవన్ గుర్తించామని తెలిపారు. వీరంతా ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారన్నారు. అనంతరం మరో మిత్రుడిని కలిసేందుకు అనంతపురం నుంచి నార్పలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.