Young Man died due to RMP Given 7 injections within Hour :వరంగల్ జిల్లాలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా గంట వ్యవధిలో ఏడు ఇంజక్షన్లు వేయడంతో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు వాపోయారు. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్(28) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
గంట వ్యవధిలో 7 ఇంజక్షన్లు ఇచ్చిన ఆర్‌ఎంపీ : ఇటీవల తీవ్ర జ్వరం, నీరసంతో నవీన్ బాధపడుతుండగా, అతడి భార్య మేఘన ఫిరంగిగడ్డలో ఉన్న ఆర్ఎంపీ ఆడెపు శ్రీనివాస్‌ను సంప్రదించారు. వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండానే జ్వరం తగ్గడానికి రెండు ఇంజక్షన్లు మొదటగా వేశాడు. ఆ తర్వాత రెండు గ్లూకోజ్‌లు పెట్టాడు. దీంతో బాధితుడు తీవ్ర చలికి లోనై వణుకుతుండడంతో గంట వ్యవధిలో వరుసగా ఏడు ఇంజక్షన్లు చేయడంతో అతని పరిస్థితి విషమించింది.
ఆర్‌ఎంపీ వైద్యం వికటించి యువకుడు మృతి : ఇది గమనించిన కుటుంబ సభ్యులు సదరు ఆర్ఎంపీని నిలదీయడంతో అతను భయపడి వెంటనే నవీన్‌ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించి, అక్కడి నుంచి పంపించేశాడు. కుటుంబ సభ్యులు నవీన్‌ను వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆపై హైదరాబాద్‌కు వైద్యనిమిత్తం తరలించే క్రమంలో మృతి చెందాడు. ఆర్ఎంపీ నిర్లక్ష్యపు వైద్యం వల్లే తన భర్త చనిపోయాడని బాధితుని భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న వైద్యుడు శ్రీనివాస్ ఆసుపత్రి కట్టేసి పరారు కాగా అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.