Idea Tech at Andhra Loyola College:ఆకాశానికి నిచ్చెనలు వేసే ఆలోచనలు యువత సొంతం. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆలోచనలకు పదును పెడుతూ నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. ఈ విద్యార్థులూ అంతే. కళాశాలలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక్కచోట చేరి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారీ విద్యార్థులు.
ఇది విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించాలనినైపుణ్యాలు మెరుగుపరచాలని ఇలా వినూత్న మార్గం ఎంచుకున్నారు. ఎంసీఏ విద్యార్థుల ఆధ్వర్యంలో ఇటీవల సమీక్ష 2కె 24 పేరిట కార్యక్రమం నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. పోస్టర్ ప్రదర్శన, డ్యాన్స్, క్విజ్, ఐడియా టెక్, బ్లైండ్ టెక్, కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఇలా వివిధ విభాగాల్లో పోటీలు జరిగాయి.
భవిష్యత్తులో ఎదుర్కొనే వివిధ రకాల సవాళ్లను అధిగమించేందుకు విద్యార్థులు వారి ఆలోచనలను ఈ వేదికగా పంచుకున్నారు. ప్రధానంగా సైబర్ నేరాలు కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రస్తుతం పరిస్థితుల్లో కృత్రిమ మేథ ఆవశ్యకత ఏంటి? రోబోలు మనుషుల ఉపాధిపై దెబ్బ కొడతాయా? అనే కోణంలో విద్యార్థులకు అవగాహన ఇచ్చారు. సమస్యలను సందర్భానుసారం ఎలా ఎదుర్కొంటూ ముందుకు సాగాలో సూచనలు చేశారు.
పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA
విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే మరో పోటీ కోడింగ్ అండ్ డీ కోడింగ్. ఈ పోటీలో నిర్దిష్ట సమయంలో విద్యార్థులు వారికి ఇచ్చిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశారు. క్విజ్ పోటీలోనూ పాల్గొని పలుపురు విద్యార్థులు సత్తాచాటారు. టీం వర్క్ చేయడం నేర్చుకున్నారు. అయితే ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల భవిష్యత్తులో కెరీర్‌లో రాణించడానికి సహాయపడతాయని అంటున్నారు విద్యార్థులు.
వివిధ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఒకే చోట చేరి ఒకరికి తెలియని విషయాలు మరొకరు తెలుసుకున్నారు. ప్రజల అవసరాలు ఏంటి? ఆ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి ఆవిష్కరణలు చేపట్టాలి? వంటి అంశాలను విద్యార్థి దశ నుంచే వీరంతా అలవరచుకుంటున్నారని అధ్యాపకులు చెబుతోన్నారు.
విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. అందుకే 10 కాలేజీల నుంచి 30 మంది ప్రతిభవంతులైన విద్యార్థులను ఎంపికచేసి ఈ పోటీలు నిర్వహించారు. ఇలా బృందంగా ఏర్పడి పూర్తి కార్యక్రమాన్ని విద్యార్థులే నిర్వహించుకున్నారు. అయితే ఇలా పని చేయడం నిబద్ధతతో పాటు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రేరణగా నిలుస్తాయంటున్నారు కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు.
విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను బయటికి తీయడానికి కళాశాలలు ఈ విజ్ఞాన కార్యక్రమం నిర్వహించాయి. ఐడియా టెక్ పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు సాంకేతిక అంశాలపై తమ ఆలోచనలు పంచుకున్నారు. రెండు రోజులపాటు సాగిన ఈ ఈవెంట్ ద్వారా కెరీర్‌లో రాణించగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడిందని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే భవిష్యత్తు కార్యాచరణని విద్యార్థులు తయారు చేసుకుని ముందుకెళ్తే వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారనే తరహాలో ఈతరం కళాశాలలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district