Revenue Minister Anagani Satya Prasad on Land Scams :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన భూ కుంభ కోణాలపై విచారణ జరిపి, బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎసైన్డ్ భూములను పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ దందాలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని, ఈ కుట్రలో అధికారులు ఉన్నా, రాజకీయ నేతలు ఉన్నా వదలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
Revenue Minister Anagani on Land Titling Act :వైఎస్సార్సీపీ పాలనలో గాడి తప్పిన రెవెన్యూ శాఖను వంద రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేస్తామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్రంలో రెవెన్యూ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, భూముల రీ-సర్వే నిర్వహణ, పేదలకు ఎసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు, లబ్ధిదారులను మోసగించి జరిగిన కొనుగోళ్లు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, భూములతో ప్రతి కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, అటువంటి శాఖను తనకు కేటాయించినందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌కు సత్యప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. 2019-24 మధ్య రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రంలో జరిగిన చర్యలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయని గుర్తుచేశారు. భూ కుంభకోణాలు ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం కాలేదని, ఇతర చోట్ల కూడా జరిగాయని ఆరోపించారు. వీటిపై సమగ్రంగా అధ్యయనం చేయించి, తగిన ఆధారాలతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలను ఆందోళనకు గురిచేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లు శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నామని అన్నారు.