Revenue Complaints Pending in AP :ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం నాన్చుడు ధోరణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా జిల్లాల్లో పరిష్కార చర్యలు తీసుకోవడంలో వేగం కొరవడుతోంది. వివిధ మార్గాల్లో గతేడాది జూన్ 15 నుంచి ఇటీవల వరకు రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రభుత్వానికి సుమారు 3.53 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 1.71 లక్షల అర్జీలను మాత్రమే పరిష్కరించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. పరిష్కారమైనట్లు చెబుతున్న వాటిలోనూ కొన్ని దరఖాస్తులపై తీసుకున్న చర్యలు కాగితాలపైనే ఉన్నాయని సమచారం.
వినతులు పరిష్కార చర్యలపై రెవెన్యూ శాఖ ప్రతి వారం సమీక్షిస్తూనే ఉంది. బాధితుల వినతులు తహసీల్దార్ల నుంచి వీఆర్వోల వద్దకు వెళ్తున్నాయి. వీఆర్వోల్లో కొందరు వీటిపై శ్రద్ధపెట్టకుండానే పరిష్కరించినట్లు చూపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది కొరతతోపాటు, ఇతర విధుల భారం ఉన్నతాధికారులను ఇబ్బందిపెడుతోంది. రీ-సర్వే జరిగే గ్రామాలకు కొన్ని మండలాల నుంచి సిబ్బందిని డిప్యూటేషనపై పంపారు.
Revenue Complaints Issue in AP : కొందరు అన్నదాతలు తమ భూమికి 1బి అడంగల్ ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ విజ్ఞప్తులు ఇచ్చినా పరిష్కారం దొరకడం లేదని చెబుతున్నారు. భూమిని ఆక్రమించారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా న్యాయం జరగలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, 1బిలో తప్పులు ఉండటంతో మరికొందరు రైతులకు ప్రభుత్వ నుంచి అందాల్సిన ఆర్థిక లబ్ధితోపాటు పంట రుణాలను పొందలేకపోతున్నారు.