Key Agreement In Davos On Huge Investments In Telangana :తెలంగాణ రైజింగ్ పేరుతో మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్‌లో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దావోస్‌లో మరో కీలక ఒప్పందం జరిగింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ ఎంవోయూ చేసుకుంది. భారీ పంప్‌డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. సన్ పెట్రో కెమికల్స్ ప్రాజెక్టులతో 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
దీంతో పాటు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ 10,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ఐటీ శాఖమంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. 400 మెగావాట్లతో కంట్రోల్ ఎస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ క్లస్టర్ ద్వారా 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎస్‌డబ్ల్యూ సంస్థ డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.
హైటెక్ సిటీలో హెచ్సీల్ టెక్ ఏర్పాటు : ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. హెచ్‌సీఎల్ కొత్త సెంటర్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్లౌడ్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3లక్షల 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీల్ టెక్ ఏర్పాటు చేసే క్యాంపస్‌లో దాదాపు 5000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే నెలలో ఈ సెంటర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి, ఐటీ మంత్రులను హెచ్సీల్ టెక్ సీఈవో విజయకుమార్ ఆహ్వానించారు. హెచ్సీల్ టెక్ విస్తరణ చేపట్టడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు.