Retired DSP Threatened Farmers with Gun in Kurnool : 'భూమి వదులుకోకపోతే కాల్చి పారేస్తాం' అంటూ ఒక విశ్రాంత డీఎస్పీ, ఇద్దరు ఉపాధ్యాయులు, వారితో పాటు వచ్చినవారు ఒక తుపాకీ చూపించి రైతుల్ని బెదిరించడం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన అప్పల నాగరాజు, అప్పల ఉరుకుందులకు పెద్దకడబూరు మండలంలోని హులికన్విలో 4.77 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో 33 సెంట్ల భూమిని తగ్గించి చూపారు. ఆ భూమిని పక్క పొలం యజమానికి కలిపారని గుర్తించారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బాధిత రైతులకు న్యాయం చేయాలని ఆదేశించింది.
Retired DSP Showed a Gun and Threatened Farmers :నాలుగు నెలల కిందట రెవెన్యూ సిబ్బంది వారికి హద్దులు చూపే ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పక్క పొలానికి చెందిన మహదేవ, చిన్న ఈరన్నలు ఆడ్డుకోగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరూ ఉపాధ్యాయులు. అనంతరం గత నెల 31న వారు ఓ విశ్రాంత డీఎస్పీ తోపాటు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి వచ్చి పంచాయితీకి రమ్మని పొలంలో కొంత భాగం కోల్పోయిన రైతులను కోరారు. దీంతో వారు పొలం వద్దకెళ్లగా అవతలి వ్యక్తుల్లో ఒకరు తుపాకీ బయటకు తీసి పట్టుకున్నారు. అయినా కూడా బాధిత రైతులు భయపడకుండా ఆ భూమి తమదని వాదించారు. ఆ భూమిని వదులుకోకపోతే కాల్చి పారేస్తామని విశ్రాంత డీఎస్పీ సహా తనతో పాటు వచ్చిన వ్యక్తుల్లో ఒకతను బెదిరించారు.