DCM washed away in Ralla Vagu : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లా కేంద్రం శివారులోని రాళ్లవాగులో వరద ఉద్ధృతి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ఈ విషయం తెలియక రాళ్లవాగు ఉద్ధృతి కల్వర్టుపై నుంచి వెళ్లిన డీసీఎం వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోగా పోలీస్, రెస్క్యూ టీమ్ సిబ్బంది నలుగురిని కాపాడారు. ఒకరు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.
'డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారు. ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో నలుగురిని రక్షించాం. మరొకరి కోసం గాలిస్తున్నారు'- తిరుపతి, మహబూబాబాద్ డీఎస్పీ
పట్టుతప్పి వరద ప్రవాహంలో గల్లంతు :డీసీఎం వాహనం రంగారెడ్డి జిల్లా కొంపెల్లి నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రికి చెందిన నాగభూషణం, సునీల్, గుంటూరుకు చెందిన వేణు, కోటయ్య, మహబూబాబాద్‌కు చెందిన దుర్గప్రసాద్ వ్యాన్లో ప్రయాణం చేస్తూ వరద ఉద్ధృతికి కొట్టుకు పోయారు.
విషయం తెలుసుకున్న పోలీస్, రెస్క్యూ టీమ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాళ్లు, ట్యూబ్లతో వ్యాన్ వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యూబ్‌ను పట్టుకొని ప్రవాహం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టుతప్పి వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. మిగతా నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు స్పీడ్ బోట్లో వెళ్లి రక్షించారు.
'హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకొన్న మిగతా నలుగురిని 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. జిల్లాలో సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చాలామటుకు వాగులన్నీ ఓవర్ ఫ్లో అయ్యాయి. రాళ్లవాగు కూడా ప్రమాదకరంగా మారింది. అందులో ఓ డీసీఎం చిక్కుకుపోయింది. అందులో ఉన్న నలుగురిని కాపాడం, మరొకరి కోసం గాల్లింపు చర్యలు సాగుతున్నాయి'- డేవిడ్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్
తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు - వరదలకు కొట్టుకుపోయి ఐదుగురు మృతి - Five People Died Due to Rains