Rescue Operation for Munneru Flood Victims : మున్నేరు వరద విలయంతో ఖమ్మంలోని 10 డివిజన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటున్న వేళ అక్కడ సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా మోహరించింది. ధంసలాపురం కాలనీ, కొత్తూరు, శ్రీనివాసనగర్, ప్రకాశ్ నగర్, రాజేంద్రనగర్, పంపింగ్ వెల్ రోడ్డు, రంగనాయకులగుట్ట, మోతీనగర్, ట్రంక్ రోడ్డు, వెంకటేశ్వరనగర్, బొక్కల గడ్డ, గణేశ్ నగర్, పద్మావతి నగర్, దానవాయిగూడెం, రామన్నపేట కాలనీలకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు.
బాధితుల కోసం నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 4 వేల 500 మంది తలదాచుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో వరద బాధితులకు వస్త్రాలు పంపిణీ చేసేందుకు 10 వేల కిట్లు తయారు చేయించి అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా పారిశుధ్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేకాధికారిగా ఐటీడీఏ పీవో రాహుల్‌ను నియమించారు. ఖమ్మంలో వరద సహాయక చర్యలు, పునరుద్ధరణ చర్యల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి గౌతమ్‌కు బాధ్యతలు అప్పగించారు.
'వరదకు పూర్తిగా దెబ్బతిన్న 10 డివిజన్లో సహాయక చర్యలు చేపట్టాం. వరదకు ఇళ్లలో బురద వచ్చి ఇంట్లోని సమన్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వీధుల్ని శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే సాధారణ పరిస్థితులు తెచ్చేలా చర్యలు చేపడుతున్నాం'- తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి