ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం సేకరణలో మారని తీరు - నాటి విధానాలే అమలు చేయాలంటున్న రైతులు - GRAINS PROCUREMENT PROBLEMS

ధాన్యం సేకరణలో రైతులకు అవే ఇబ్బందులు - 2019 నాటికి ముందున్న విధానాలు అమలు చేయాలంటున్న అన్నదాతలు

Grains_Procurement_Problems
Grains Procurement Problems (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 8:09 AM IST

Grains Procurement Problems: ప్రభుత్వాలు మారుతున్నా, ధాన్యం సేకరణలో అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తేమశాతం మొదలు అనేక ఇతర కారణాల చూపుతూ రైతులకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎన్నడూలేనంతగా ఇబ్బందులుపడ్డ అన్నదాతలు, ప్రభుత్వం మారిన తరువాత అయినా తమ పరిస్థితి మారుతుందని ఆశించారు. కానీ అవే విధానాలు కొనసాగుతున్నాయని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

గత ఐదేళ్లలో భారీ వర్షాలు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిబంధనల కారణంగా రాష్ట్రంలో ఏటికేడు వరి సాగు, ఉత్పత్తి తగ్గుతున్నాయి. ఈ-క్రాప్‌లో నమోదు, రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు నుంచి మిల్లుకు వెళ్లేదాకా అడుగడుగునా రైతులకు సతాయింపులే ఎదురవుతున్నాయి. ధాన్యం సొమ్ము కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా ఖరీప్‌లో 40 లక్షల ఎకరాల దాకా సాగవ్వాల్సిన వరి గతేడాది 33 లక్షల 50 వేల ఎకరాలకు పడిపోయింది.

రైతుల కష్టాలను తీర్చడం లేదు: 2019-20 నాటితో పోలిస్తే 2023-24లో ధాన్యం సేకరణ 18 లక్షల టన్నులు తగ్గింది. దశాబ్దాలుగా వరి పండిస్తున్నామంటున్న రైతులు, గత ప్రభుత్వంలో పడినన్ని అగచాట్లు ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాదైనా అధికారుల తీరు మారుతుందని ఆశించినా ధోరణి మారలేదనే అసహనం వ్యక్తమవుతోంది. సమస్య వచ్చినప్పుడు విధానపరమైన నిర్ణయాలను సడలించకుండా కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని మమ అనిపిస్తున్నారు. అధికారులు తెచ్చే ప్రతి నిబంధన, దళారులు, మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది తప్ప రైతుల కష్టాలను తీర్చడం లేదు.
ముంచుకొచ్చిన తుపాను - చలనం లేని అధికారులు 'ధాన్యం కొనుగోళ్లకు రైతుల ఎదురుచూపులు'

ధాన్యం సేకరణ తీరు మారలేదు: ధాన్యం అమ్ముకునేందుకు గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. సేకరణ విధానాలను సరళతరం చేయాలని సూచించారు. 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమచేయాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, చాలా వరకు 24 గంటల్లోనే వేస్తోంది. కానీ, ధాన్యం సేకరణ తీరు మారలేదు. తేమ పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలుచోట్ల గోనె సంచులు, రవాణా ఖర్చులూ రైతులే భరిస్తున్నారు.

మిల్లర్ల మాటకే ఎక్కువ ప్రాధాన్యం: అయినా రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. తేమశాతం 17 కంటే ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు. బస్తాకు 5 కిలోల వరకు తూకం తగ్గించి మద్దతుధర నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల బస్తాకు 200 రూపాయల వరకు మద్దతు ధర కంటే తక్కువగా లభిస్తోంది. రైతు సేవా కేంద్రాల్లోని టెక్నికల్‌ అసిస్టెంట్లు కూడా రైతు సేవ కంటే మిల్లర్ల మాటకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ధాన్యం అమ్మాలంటే పొదుపు సంఘాలు, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. రైతులు నేరుగా ధాన్యాన్ని అక్కడకు తీసుకెళ్లి విక్రయించేవారు. మిల్లర్లు అక్కడే ఉంటారు కాబట్టి ధాన్యాన్ని చూసిన తరువాతే కొనుగోలు చేసేవారు.

ప్రభుత్వమే అక్కడి నుంచి ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లేది. ఆ వెంటనే డబ్బు జమ చేసేవారు. ధాన్యం సేకరించడానికి గత ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాలశాఖ పెద్ద పుస్తకమే రూపొందించింది. ఈ నిబంధనల వల్ల రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు. దీంతో మిల్లరు చెప్పిందే ధర, వారు వేసిందే తూకం అవుతోంది. గత ఐదేళ్లతో పాటు ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వం వీటన్నింటినీ సడలించి 2019 ముందు నాటి సరళమైన విధానాలు అమలుచేయాలని రైతులు కోరుతున్నారు.

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులు - ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

ABOUT THE AUTHOR

...view details