Red Alert for North Andhra: బంగాళాఖాతంలో ఒడిశా- బంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన వాయుగుండం క్రమంగా వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండురోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు భారీ వర్షం సూచన ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
విరిగిపడుతున్న కొండచరియలు:విజయనగరం, విశాఖ, తూగో, పగో జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్ పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా 70 కి.మీ బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కళింగ, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గోపాలపట్నంలోని రామకృష్ణానగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లకు ప్రమాదం పొంచివుంది. సమాచారం అందుకున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆ ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరారు. ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు. మిగతా ఇళ్లకు కూడా ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert