Ex Minister Anil Kumar Yadav: నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయారు. నెల్లూరుకు చెందిన మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ బదిలీల్లో పల్నాడుకు వచ్చి భంగపడ్డారు. మాట్లాడితే బూతులు అవతలి వారిపై వెక్కిరింపులు, వెటకారపు కూతలకు జనం బుద్ధి చెప్పారు. బుల్లెట్ దిగిందా లేదా అంటూ వ్యంగాస్త్రాలు సంధించే మాజీమంత్రికి ఓటమితో బుల్లెట్ దిగినట్లయింది.
ఊహించని షాక్: నెల్లూరు నగరం నుంచి 2019లో వైసీపీ తరపున గెలిచి మంత్రి అయ్యారు అనిల్ కుమార్ యాదవ్. నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిందేం లేకపోయినా మాటలు మాత్రం కోటలు దాటేవి. పోలవరం ప్రాజెక్టు 2020కల్లా పూర్తి చేస్తామని, 2021 కల్లా నిర్మిస్తామని ఇలా మూడు సార్లు గడువులు పెంచారు. ప్రాజెక్టు నిర్మాణం సంగతేమో కానీ, ఆయన మంత్రి పదవి ఊడింది. అయినా అనిల్ మాటబిరుసులో తేడా లేదు. ప్రెస్ మీట్లలో బూతులు తిట్టడం, అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడటం ఆయనకు అలవాటు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి అనిల్ కు ఊహించని షాకిచ్చారు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు అసెంబ్లీకి కాదని, నరసరావుపేట పార్లమెంటుకు పోటీ చేయాలని పంపించారు. తమ నాయకుడు ఇచ్చిన స్ట్రోక్ తో మూడు జిల్లాల ఇవతల పడ్డారు అనిల్.
'రాంబాబూ నువ్వు మాకొద్దు' - అంబటికి సత్తెనపల్లిలో ఘరో పరాజయం! - Ambati lost in Sattenapalli constituency
సామాజిక వర్గం ఓట్ల కోసం: పల్నాడు జిల్లాలో బీసీలు ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని జగన్ ఆయన్ను ఇక్కడకు పంపించారు. ఇక్కడకు వచ్చాక నెల్లూరు వెటకారానికి పల్నాటి పౌరుషం జతచేసి మరింత నోరేసుకుని మాట్లాడారు. అయితే తెదేపా నుంచి పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు సౌమ్యంగా మాట్లాడుతూనే వాటికి సమాధానం చెప్పారు. అనిల్ మాదిరిగా నోరేసుకుని అరవటం కాకుండా... ప్రజలకు ఏం కావాలో ఏం చేస్తామో అర్థమయ్యేలా వివరించి ఓట్లడిగారు. సిట్టింగ్ ఎంపిగా తాను చేసిన అభివృద్ధికి గురించి చెప్పారు. వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తెచ్చానని... మళ్లీ గెలిపిస్తే దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనిల్ మాత్రం కేవలం కులం కార్డు నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఎన్నికల్లో ఓట్లడిగారు. కానీ పల్నాడు ఓటర్లు అనిల్ కు కీలెరిగి వాత పెట్టారు. నోరేసుకుని అరవటానికి అంతదూరం నుంచి రావాల్సిన పనిలేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు. అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. ప్రజలకు మంచి కోరుకునే వారిని గెలిపించుకోవాలని భావించారు. లావు శ్రీకృష్ణదేవరాయలకు రెండోసారి పట్టం కట్టారు. అనిల్ కు పల్నాటి బుల్లెట్ దించారు.
ఆర్కే రోజా ఘోర పరాజయం - జబర్దస్త్ ఓటమిని రుచిచూపించిన నగరి ప్రజలు - Roja lost in Nagari constituency
అనిల్ కుమార్ యాదవ్ (ETV Bharat)