RBK Employee Pujitha Suicide : బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా పని చేస్తున్న ఉద్యోగి బి.పూజిత ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆమె పని చేస్తున్న ఆర్బీకేకు శాశ్వత భవనం లేదు. గ్రామ సచివాలయంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన పాత గదుల్ని సరుకు నిల్వ కోసం కేటాయించారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 142 డీఏపీ బస్తాలు తడిచిపోయాయి. దీనితో పాటు గ్రామంలో కొందరు అధికార పార్టీ నేతలు డబ్బులు ఇవ్వకుండా ఎరువుల బస్తాలు తీసుకెళ్లారు. ఒక్క నాయకుడే 43 వేల రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉంది. తడిచిన బస్తాల డబ్బులు, బకాయిలు అన్నీ చెల్లించాలని పూజితను అధికారులు ఆదేశించారు. దీంతో తీవ్ర మనస్థాపంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
అధికారుల వేధింపులు, వైఎస్సార్సీపీ నేతల దౌర్జన్యం - నిండు ప్రాణం బలి
డబ్బులు చెల్లించాలని ఒత్తిడి :రాష్ట్రంలో చాలాచోట్ల రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవు. చాలా చోట్ల ఆర్బీకేలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి అద్దెలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. యజమానులు తాళాలు వేసుకుంటున్నారు. అలాంటి సమయంలో సిబ్బంది సమీపంలోని సచివాలయం నుంచి విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆర్బీకే సిబ్బంది ఇన్ని పాట్లు పడుతున్నా, కొంతమంది అధికార పార్టీ నేతలు తమ దర్పం చూపిస్తున్నారు.
RBK Employee Suicide in Bapatla :డబ్బులు చెల్లించకుండా ఎరువులు తీసుకెళ్తున్నారు. తర్వాత ఇస్తామని మభ్యపెడుతున్నారు. అలాంటి వారిని ఎదిరించలేక, సరుకుకు లెక్కలు చెప్పలేక సిబ్బంది సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం పంపిన సరకు ప్రకారం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో ఆర్బీకే సిబ్బంది మనోవేధనకు గురవుతున్నారు. పూజిత కూడా ఇలా మనోవేధనతోనే మరణించిందని ఆర్బీకే ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.