RASTA Free Service in Vijayawada : విజయవాడలో వరద నీరు పోయినా ముంపు బాధితులను కష్టాలు విడలేదు. వేల రూపాయలు పోసి కొన్న గృహోపకరణాలు పనికిరాకుండా పోయాయి. ఇటువంటి సమయంలో బాధితులకు సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. సామాజిక బాధ్యతగా ముంపు బాధితులకు సాయం అందిస్తున్నారు.
బాధితులకు సాయం చేయడం సంతోషంగా ఉంది : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టెక్నీషియన్లు సుమారు 80 మంది విజయవాడలో ఉంటూ వరద బాధితుల ఇళ్లలోని ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్‌లను ఉచితంగా సర్వీసింగ్ చేస్తున్నారు. ఏదైనా వస్తువులు మార్చాల్సి వస్తే వాటిని సగం ధరకే అందిస్తున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి ఉచితంగా సర్వీసు అందించామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ముంపు బాధితులకు సాయం చేయడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
"ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్‌లను ఉచితంగా సర్వీసు చేస్తున్నాం. వెయ్యి రూపాయల లోపు ఉన్న వస్తువులను ఉచితంగా అందిస్తున్నాం. అలాగే కొన్ని మేజర్ పార్ట్స్‌ను సగం ధరకే అందిస్తున్నాం. ఇప్పటి వరకూ 1000 కుటుంబాలకు సేవలను అందించాం. వరద ప్రాంతాల్లో బాధితులకు సాయం చేయటం సంతృప్తిని ఇస్తుంది." - జానీ, రాస్తా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
"వరదల వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. రిపేరు చేయాలంటే ఒక్కొదానికి వేలకు వేలు అడుగుతున్నారు. ఎలా అని దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు రాస్తా ప్రతినిధులు వచ్చి మా వస్తువులను పరిశీలించి ఉచితంగా సర్వీసింగ్ చేసి ఇస్తున్నారు. ఇటువంటి సమయంలో తమకు ఎంతో కొంత ఊరటగా ఉంది. అసోసియేషన్ ప్రతినిధులు అందిస్తోన్న సాయం తమకు చాలా ఉపయోగపడుతుంది. వారికి మా ధన్యావాదాలు తెలుపుకుంటున్నాం."- బాధితులు
పాడైపోయిన ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్‌లను ఉచితంగా సర్వీస్ చేసేందుకు రాస్తా ప్రతినిధులు రావటంతో ముంపు బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి గృహోపరణాలు రిపేర్ చేయించుకునే పరిస్థితిలో తాము లేమని వారు ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో తమకు ఎంతో కొంత ఊరటగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు అందిస్తోన్న సాయం తమకు చాలా ఉపయోగపడుతుందని బాధితులు అంటున్నారు. మరోవైపు వరదల్లో తడిచిన ఎలక్ట్రానిక్ వస్తువులను తుడిచి ఆరబెట్టిన తర్వాతే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు.
వరద బాధితులకు గుడ్ న్యూస్ - నష్టం వివరాల నమోదుకు గడువు పొడగింపు - Government Extended Enumeration
బైక్ వరదలో మునిగిపోయిందా?- టెక్నీషిన్స్ ఏమంటున్నారంటే! - Flooded bike repair