తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపంచాన్నే అబ్బురపరిచిన చిత్రనగరి - ఫిలిం సిటీని సృష్టించిన దార్శనికుడు రామోజీ - Ramoji Film City History - RAMOJI FILM CITY HISTORY

Ramoji Film City : కొండలు, గుట్టలు, బండలు, బంజరు భూములను ప్రపంచంలోనే అత్యద్భుతమైన చిత్రనగరిగా రూపుదిద్దిన దార్శనికుడు రామోజీరావు. కనుచూపు మేరలో కనువిందు చేసే కమనీయ కట్టడాల, రమణీయ వనాల సమాహారంగా మార్చిన కృషీవలుడు దశాబ్దాల తరబడి సాగిన నిర్విరామంగా శ్రమించి వ్యయప్రయాసలకు వెరవకుండా, అద్వితీయ సంకల్పంతో ఓ స్వపాన్ని సాకారం చేశారు. ఆ ఫలితమే రామోజీ ఫిలిం సిటీ.

Ramoji Film City History
Ramoji Film City History (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 12:47 PM IST

Updated : Jun 8, 2024, 7:56 PM IST

ప్రపంచాన్నే అబ్బురపరిచిన చిత్రనగరి - ఫిలిం సిటీని సృష్టించిన దార్శనికుడు రామోజీ (ETV Bharat)

Ramoji Film City History : సినీ పరిశ్రమ సిగలో సింగారాల పువ్వుగా, పర్యాటకుల పెదవులపై సంబరాల నవ్వుగా రూపుదిద్దుకున్న అపురూప చిత్రనగరం రామోజీ ఫిలిం సిటీ, ప్రస్తుతం ఓ అంతర్జాతీయ అద్భుతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ రికార్డుల గీటురాయిపై మెరిసిన మేలిమి బంగారం. దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ సొగసుల సముదాయం ఏకంగా 5 కోట్ల పనిదినాలతో రూపుదిద్దుకున్న కళాక్షేత్రం. ప్రత్యక్షంగా 7500 మందిని అక్కున్న చేర్చుకున్న ఉపాధి కేంద్రం.

సుమారు రెండు వేల ఎకరాలకు పైబడిన సువిశాల ప్రదేశాన్ని సుందరంగా మలిచిన కార్యరంగం. ఇప్పటికే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు పన్ను చెల్లించిన విస్తృత వ్యాపార కేంద్రం. హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని కుగ్రామం అనాజ్‌పూర్‌లో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ సందర్శిస్తే కానీ జంటనగరాల వీక్షణ పూర్తికాదని పర్యాటకులు భావించే అద్భుత కళాఖండం.

స్క్రిప్టుతో రండి - తుది ప్రింట్‌తో వెళ్లండి : "స్క్రిప్టుతో రండి- తుది ప్రింట్‌తో వెళ్లండి" అనేది ఇక్కడ కేవలం నినాదమే కాదు. కళ్లెదుట నిలిచిన కమనీయ వాస్తవం. సినిమా అంటే మాటలు కాదు ఎన్నో సన్నివేశాలు, ఎన్నెన్నో వేషాలు, మరెన్నో అవసరాలు ఇంకెన్నో పరిసరాలు. అన్నింటినీ కలిపి ఒకేచోట అందిస్తామనేది ఏమాత్రం అతిశయోక్తి కాదని, అత్యంత నిబ్బరంగా చెప్పగలిగిన ఆత్మవిశ్వాసపు శక్తిగా ఫిలిం సిటీని తీర్చిదిద్దారు రామోజీరావు. తెలుగు, హిందీ, బెంగాలీ, ఒడియా, మలయాళం, తమిళ, కన్నడ, మరాఠీ, అస్సామీ, బంగ్లా, ఇంగ్లిష్ ఇలా విభిన్న భాషలకు చెందిన వేలాది చిత్రాలు రూపుదిద్దుకున్న ఈ ఫిలిం సిటీ గురించి ఏ సినీ ప్రముఖుడిని అడిగినా ఒకటే చెబుతారు 'మనలో సత్తా ఉండాలేగానీ రామోజీ ఫిలిం సిటీలో సదుపాయాలకు కొదువ లేదని' అవును అది అక్షరాలా నిజం.

హాలీవుడ్ స్థాయిలో నిలిచే అత్యాధునిక సామగ్రి :ఏకకాలంలో 20 సినిమాలు నిర్మించినా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ఆఘమేఘాల మీద అమర్చే సౌకర్యాలకు నెలవు. హాలీవుడ్ స్థాయిలో నిలిచే అత్యాధునిక సామగ్రిని సమకూర్చుకున్న విస్తృత దృక్పథానికి కొలువు. లోపలికి అడుగు పెడుతూనే ఆ సంగతి అర్థమైపోతుంది. అటు చూస్తే చరిత్రకు అద్దంపట్టే కోట. ఇటు చూస్తే అబ్బురపరిచే హవామహల్ బాట. ఆవైపు అమెరికా ఓల్డ్ వెస్ట్ వీధి సందళ్లు. ఈవైపు అలనాటి మొఘల్ సామ్రాజ్యపు ఆనవాళ్లు.

వందలాది లొకేషన్లలో షూటింగ్‌లు : అంతేకాదు ప్యారిస్ అందాలు, ఇంగ్లండ్ సొగసులు, రోమ్ సోయగాలు, బాగ్దాద్ వైభవాలు, న్యూయార్క్ వైభోగాలు అన్నింటికీ చిరునామా రామోజీ ఫిలిం సిటీలోని ప్రిన్స్ స్ట్రీట్. అడవుల మధ్య ఏకాంత ప్రదేశం కావాలన్నా, అత్యాధునిక ఆకాశహర్మ్యాలు కావాలన్నా, రమణీయ పౌరాణిక నేపథ్యానికి అనువైన సుందర సౌధాలు కావాలన్నా అన్నీ ఒకేచోట లభ్యమవుతాయి. విమానాశ్రయంలో చిత్రీకరణ చేయాలనుకున్నా, ఆసుపత్రిలో షూటింగ్ జరపాలనుకున్నా, జైలు కావాలన్నా, ఆలయ ప్రాంగణం అవసరమైనా ఇలా ఒకటా, రెండా వందలాది లొకేషన్లు.

చిన్నాపెద్ద కలిపి వందలాది స్టూడియో ప్రాంగణాలు. సువిశాలమైన షూటింగ్ ఫ్లోర్లు. సినిమా క్లైమాక్స్ కోసం విధ్వంసం సృష్టించాలన్నా, అందుకు తగిన ఏర్పాట్లు. బాంబులు పేలి కార్లు గాల్లోకి లేవాలన్నా, అపార్ట్‌మెంట్‌ మొత్తం అగ్నిప్రమాదంలో తగుబడిపోతున్నట్లు చిత్రీకరించాలన్నా, ఒక్కమాట చెబితే చాలు అందుకు అనుగుణంగా అల్లుకుపోయే సిబ్బంది అందుబాటులో ఉంటారు. విధ్వంసం నుంచి బయటపడి ప్రశాంత వాతావరణంలోకి కెమెరాను తిప్పాలనుకుంటే అందాల గ్రామం అలరిస్తుంది.

ఆలయ నేపథ్యం కావాలంటే ఆగమశాస్త్రబద్ధంగా నిర్మించిన గుడి ప్రాంగణం ఉంది. అందులో ఏ దేవుడినైనా ప్రతిష్టించుకోవచ్చు. దేవతా విగ్రహాలన్నీ సర్వాంగ సుందరంగా తయారై సిద్ధంగా ఉంటాయి. ఇవేమీ కాదు సరికొత్త లోకం కావాలనుకుంటే, ఆ ఊహలేంటో చెబితే చాలు, ఆ లోకాన్ని సాకారం చేసి కళ్లముందు నిలుపుతారు. ఎందుకంటే ఏ కళారూపాన్నైనా, ఏ అపురూప శిల్పాన్నైనా, ఎలాంటి కట్టడాన్నైనా నిర్ణీత సమయంలో రూపొందించే కళాకారుల, శిల్పకారులు, ప్రతిభావంతులు ఇక్కడ సదా సిద్ధంగా ఉంటారు.

ఎర్త్ స్టేషన్‌ ఇక్కడొక ప్రత్యేక ఆకర్షణ : అక్కడితో అయిపోలేదు. అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ రామోజీ ఫిలిం సిటీ సొంతం. అత్యద్భుత శబ్ద విన్యాసాలు సిద్ధం. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే కెమెరాలను వినియోగించుకోవాలన్నా సర్వం సంసిద్ధం. క్రేన్లు, డోలీలు, ట్రాలీలు, కదిలే జనరేటర్లు, ఆడియో పరికరాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక వర్షం ఎఫెక్ట్ కావాలన్నా, చిటికెలో పెనుగాలులు వీయాలన్నా, మెరుపులు, పొగమంచు, పొగ, బుడగలు, రాత్రివేళ పగలు కావాలన్నా, పగటిపూట చీకట్లు అలుముకోవాలన్నా ఎల్లవేళలా అన్నీ సిద్ధంగా ఉంటాయి. అన్నింటికీ మించి ఎర్త్ స్టేషన్‌ ఇక్కడొక ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటి వ్యవస్థను ఓ ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించడం దేశంలో ఇక్కడే ప్రథమం.

కుమార్తె పెళ్లి వేడుకలు అపురూపంగా నిర్వహించాలనుకున్నా, కార్పొరేట్ సమావేశాన్ని అబ్బురపరిచేలా జరపాలనుకున్నా రామోజీ ఫిలిం సిటీకి రావాల్సిందే. 20 మంది నుంచి 2,000ల మంది వరకు సరిపోయే సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆరుబయట ఆస్వాదించాలనుకుంటే ఎలాంటి సందర్భానికైనా వేలాది మందికి సరపడా వసతులు ఉన్నాయి. అంతేకాదు రెయిన్‌బో గుండు సూది నుంచి హెలికాఫ్టర్ వరకు ఏది కావాలన్నా సమకూర్చే పరేడ్, స్టార్ హోటళ్లు తార, సితారతోపాటు సినిమా యూనిట్ సభ్యులకు బస కల్పించే సహారా హోటల్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా హెలికాఫ్టర్‌లో ఫిలిం సిటీకి రావాలనుకుంటే హెలిప్యాడ్ సంసిద్ధం.

రామోజీ ఫిల్మ్‌సిటీ ఒక సొగసుల లోకం : ఇదంతా ఒక ఎత్తు ఫిలిం సిటీ అందాలన్నీ మరో ఎత్తు. పిల్లలకిది కేరింతల కేంద్రం. పెద్దలకిది అనుభూతుల స్వర్గం. నవ దంపతులకిది మధుర విహారాల ప్రదేశం. ఎటు తల తిప్పినా సుందర నందన వనాలే. వేలాది సుమ సోయగాల నిలయాలే. పిల్లల్ని అలరించే పండుస్థాన్ చూస్తే పెద్దలు కూడా వయసు మర్చిపోతారు. "థ్రిల్ విల్లే"లో తుళ్లిపడే పిల్లల కోసం సాహసాలు, సరదాలు, తిప్పుళ్ల మజానిచ్చే రైడ్లు, ట్విస్టర్లు, రేంజర్లు అబ్బో చెప్పాలంటే బోరాసురలో అడుగుపెడితే సరి. ఇది ఆసియాలోనే అపురూపమైనది మరి. ఇంకా ట్రైన్ రెస్టారెంట్, దాదాజిన్ ఆర్క్ వీడియో గేమ్స్ పార్లర్, టింబర్‌ల్యాండ్‌, డోమ్ యాంపి థియేటర్ ఎంథ్రాలర్ ఇవన్నీ చూస్తే పిల్లలు ఎగిరి గంతేస్తారు. మొత్తానికి రామోజీ ఫిలిం సిటీ ఒక సొగసుల లోకం. సోయగాల స్వప్నం.

రామోజీరావు అస్తమయం - ప్రముఖుల దిగ్భ్రాంతి - Cm Revanth On Ramoji Rao Demise

రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao biography

Last Updated : Jun 8, 2024, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details