Ramoji Rao Birth Anniversary Celebrations: అక్షర యోధుడు, అలుపెరుగని ధీరుడు స్వర్గీయ రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అంజలి ఘటించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. రామోజీరావు జయంతి వేళ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన బాటలోనే ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.
తెలుగు రాష్ట్రాలలో రామోజీరావు 88వ జయంతి వేడుకలను సగర్వంగా నిర్వహించారు. సమాజానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు నాంది రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రామోజీరావు వేసిన బాటలు నేటికీ స్ఫూర్తిదాయకమని, వ్యక్తిగా మొదలై శక్తిమంతమైన వ్యవస్థగా రామోజీరావు ఎదిగారని అన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి రామోజీరావు బాటలు పరిచారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్ సిబ్బంది అన్నారు. రామోజీరావు చిత్రపటం వద్ద అంజలి ఘటించి మౌనం పాటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
"రామోజీరావు సర్ ప్రతి సంవత్సరం స్కూల్లో విద్యా వ్యాప్తికి, అదే విధంగా పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం రకరకాల పద్ధతులు అవలంభిచాలని ఆదేశిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. అదే పద్ధతిలో వారు ఈరోజు మా మధ్య లేకున్నా కూడా ఉన్నట్టుగానే భావిస్తున్నాము. స్కూల్లో, ఇతర విషయాలలో ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రతిజ్ఞ చేస్తున్నాము". - డాక్టర్ రావి చంద్రశేఖర్, రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ