Media Mogul Ramoji Rao Granddaughter Sahari Interview : మీడియా మొఘల్, దిగ్గజ వ్యాపారవేత్త క్రమశిక్షణకు మారుపేరు. ఇది రామోజీరావు గురించి ప్రపంచానికి తెలిసిన కోణం. అల్లరి భరించారు. బుజ్జగించారు. కథలు చెప్పారు. విలువల్నీ, జీవితపాఠాల్నీ నేర్పించారు. ఇవీ ఆయన మనవరాళ్లకు, మనవడికి మాత్రమే తెలిసిన విషయాలు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారసులు సహరి, బృహతి, కీర్తి సోహన, సుజయ్, దివిజ. వారిలో ఒకరైన సహరి ఈటీవీ భారత్ - ఈనాడుతో తమ అనుభవాలు పంచుకున్నారు.
తాతగారిపై నాకున్న భావనేంటి అంటే భయం, భక్తి, అంతకుమించి ప్రేమ ఉన్నాయని చెబుతా. క్రమశిక్షణ, సమయపాలన పట్ల ఎంత నిక్కచ్చిగా ఉంటారో మామీద అంతేస్థాయిలో ప్రేమనీ చూపించేవారు. పైగా నేను మొదటి మనవరాల్ని కదా కాస్త చనువెక్కువ. చిన్నప్పుడు ఆయన నాకే సొంతం అనుకునేదాన్ని. నేను పుట్టగానే తాతగారు ‘మా అమ్మే పుట్టింది’ అన్నారట. నాతో కూడా ‘నువ్వు మా అమ్మవి. చూడు నీ కళ్లు అచ్చు మా అమ్మలాగే ఉన్నాయి’ అనేవారు. ఆయన దగ్గరే పడుకునేదాన్ని. పొట్టమీదెక్కి ఆడుకునేదాన్ని. మూడున్నరకే లేచి పేపర్లు చదువుతారు కదా లైట్లు వేస్తే ‘తాతగారూ నాకు నిద్ర రావట్లేదు’ అని ఫిర్యాదు చేసేదాన్ని. ఆయన మీటింగ్‌లో ఉంటే ఓ పక్కన కూర్చొని ఆడుకునేదాన్ని.
తాతగారికి తెలుగంటే ప్రాణం. మాకు తెలుగు రాకపోతే ఊరుకుంటారా? అందుకే పిల్లలందరికీ తెలుగు చదవడం, రాయడం వచ్చు. సెలవుల్లో మాతో గడపడం కాదు. ఎంత పనిలో ఉన్నా మాకు సమయం ఇచ్చేవారు. ఆయన పనిలో ఉన్నారని మేం వెనక్కి వెళ్లబోయినా ‘రా నాన్నా నీ కన్నా పని ఎక్కువా’ అనేవారు. మేమంటే అంత ప్రేమ! అమెరికాలో చదువుతున్నప్పుడూ నాకు వీలున్న సమయమేదో కనుక్కుని మరీ ఫోన్ చేసేవారు. ఆరోగ్యం బాగోలేకపోతే ఉదయం, సాయంత్రం బాగోగులు కనుక్కునేవారు. ఇంత ప్రేమ చూపించినా క్రమశిక్షణ తప్పనిసరి అనేవారు. వేళకి తినకపోయినా పడుకోకపోయినా ఊరుకునేవారు కాదు. ఆయన లంచ్ చేస్తున్నారంటే మధ్యాహ్నం 1.15 అయినట్లు. వాచీలో టైమ్ ఎప్పుడూ పది నిమిషాలు ముందే ఉంటుంది. ఏదైనా సాధించాలంటే సమయపాలన, క్రమశిక్షణ ఉండాలనేవారు. ‘నేను పదికల్లా ఆఫీసుకి వస్తా. నేను రాకపోతే పని ఆగిపోతుందని కాదు. కానీ గ్రూప్ మొత్తానికీ అదో మెసేజ్. అందుకే వయసుతో పని లేకుండా సమయానికి వెళతాను’అనేవారు. అలాగని తన ఆలోచనలను రుద్దాలి అనుకోరు. ఉదాహరణకు నేను కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేస్తానన్నా. తాతగారికి అది అంత ఉపయోగం అనిపించలేదు. చదువు 10, జీవితం 90 శాతం నేర్పిస్తుందంటారాయన. కానీ తుది నిర్ణయాన్ని మాత్రం నాకే వదిలేశారు.