Raksha Bandhan 2024 in AP : తోడపుట్టిన సోదరికి జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుంటానని సోదరుడు ఇచ్చే అభయమే రక్షాబంధన్. తరాలు మారినా, యుగాలు గడిచినా వన్నె తరగనిది ఈ పండుగ. అలాంటి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీ సందర్భంగా పలువురు నేతలు, ప్రముఖులు ప్రజలకు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu Rakhi Wishes :తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కాచెల్లెళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం మొదటినుంచి మహిళల పక్షపాతి అని గుర్తు చేశారు. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన విషయం ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలను, ఆస్తులను ఆడవారి పేరిట ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా టీడీపీనేనని అన్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు తెచ్చామని, బాలికా విద్యను ప్రోత్సహించామని చెప్పారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు అన్నివేళలా, అన్నివిధాలా అండగా ఉంటానని రక్షాబంధన్ సందర్భంగా హామీ ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రకటించారు.
Pawan Kalyan Rakhi Wishes 2024 : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. సోదర సోదరి ప్రేమ అనుభవంతో అర్థమవుతుందని తెలిపారు. అక్కాచెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. విప్లవ కవి గద్దర్ పాడినట్టు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో, అక్క నుదుట తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో అన్నారు. అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వారికి జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప అంటూ తన భావాలు పంచుకున్నారు.