RGUKT IIIT Students protest over VC :నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతోంది. ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ రాజీనామా చేయాలంటూ నాలుగైదు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్తగా శాశ్వత వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా వీసీ, డైరెక్టర్ చేసిన ఆర్ధిక వ్యవహార అంశాలను సైతం బహిర్గతం చేయాలని, ఏళ్లుగా కొనసాగుతున్న మెస్ కాంట్రాక్టులను రద్దు చేసి వాటికి కేటాయించిన నిధుల వివరాలు వెల్లడించాలని కోరుకుంటున్నారు. బోధన, బోధనేతర విభాగాల్లో శాశ్వత నియామకాలు చేపట్టాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై స్వతంత్ర కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులు తెర మీదకు తెస్తున్న సమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం లేకపోవటంతో ఆందోళనలకు దారితీస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2022 జూన్లో నెలరోజుల పాటు విద్యార్థులు మూకుమ్మడిగా ఆందోళన నిర్వహించటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అప్పటి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్, నాటి గవర్నర్ తమిళిసై వేర్వేరుగా విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. చివరికి అప్పటి ప్రభుత్వం దిగివచ్చి కేటీఆర్ నేతృత్వంలోని సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డితో కూడిన బృందం ఆర్జీయూకేటీని సందర్శించింది.
ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా :నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని అప్పటి మంత్రులు భరోసా ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. తర్వాత పాలకులు పట్టించుకోలేదు. విద్యార్థుల డిమాండ్లు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టీఎస్ఏఎస్) పేరిట ఏర్పడిన సంఘం నాలుగు రోజులుగా ఆర్జీయూకేటీలోని పరిపాలనా భవనం ఎదుట నిరసన చేస్తోంది. విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అధికారులు తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయటం వివాదాస్పదమవుతోంది.