Rains Effect in East Godavari District: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం వీడటం లేదు. గోదావరి వరద ఉద్ధృతికి పరివాహక ప్రాంతాలు వణికిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎర్రకాలువ ప్రవాహానికి సింగవరం, నందమూరు, తాళ్లపాలెంలో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కొండ కాలువ ఉద్ధృతికి కొవ్వూరు, గోపాలపురంలో ఇళ్లలోకి వరద చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పడవల్లోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. వరి చేలు నీటమునిగి నాట్లు నీటిలో తుడిచిపెట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అలసత్వం వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో తమను కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు పంట చేలు నీటమునిగాయి. కనుచూపుమేర పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల పరిధిలో లక్షల ఎకరాల్లో కౌలు రైతులు వరి సాగు చేస్తున్నారు. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయలకు పోటెత్తుతున్న వరద రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాలువ ఆధునికీకరణలో అధికారులు అలసత్వంగా వ్యవహరించడంతో వ్యర్థాలు పేరుకుపోయాయి. పూడిక తీయకపోవడంతో వర్షపునీరు పైకి ఎగదన్నుతోంది. నీరు బయటకు పోయే మార్గం లేక నాలుగు రోజులుగా వరినాట్లు నీటిలోనే నానుతున్నాయి. నాట్లు వేసిన చేలల్లో మునలు పైకి తేలుతుండటంతో రైతుల దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయిని, నారు కుళ్లిపోతే నష్టపోతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.