తెలంగాణ

telangana

హైదరాబాద్​లో భారీవర్షం - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న మేయర్​ - Hyderabad Rains Update

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 7:11 PM IST

Updated : Jul 14, 2024, 8:43 PM IST

Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దృష్ట్యా జీహెచ్​ఎంసీ అధికారుల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి.

Rains in Hyderabad
Rains in Hyderabad (ETV Bharat)

Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, హైదర్‌నగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతినగర్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట వర్షం కురిసింది. చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్‌, అమీర్‌పేట్‌, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లో మోస్తరు వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్​బాగ్, నారాయణగూడ, హిమాయత్​నగర్ , ఖైరతాబాద్, లక్డికపూల్​లో వర్షం భారీగా పడుతోంది. మేడ్చల్, కృష్ణాపూర్, మల్లంపేట్, గండిమైసమ్మ, దుండిగల్​లో ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీవాన పడింది.

సికింద్రాబాద్ పరిధిలోని రెజిమెంటల్ బజార్, పాలిక బజార్, మొండా మార్కెట్ ప్రాంతాల్లో భారీగా రహదారుల పైకి చేరిన వరద నీరు చేరింది. మోకాళ్ల లోతు నీరు రహదారులపై ప్రవహిస్తుండడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం సాయంత్రం అలా సరదాగా బయటకు వచ్చిన నగరవాసులు చాలామంది వర్షంలో చిక్కుకుపోయారు. నగరం అంతటా వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్​ ఆగిపోయింది. చాలా చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్​ఎంసీ యాక్షన్​ టీమ్స్ వర్షపు నీటికి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరు చాలాచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మాదాపూర్‌, హైటెక్‌సిటీ మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

కొట్టుకుపోయిన కార్లు :ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్, అశోక్​నగర్, ఆర్టీసీ క్రాస్​ రోడ్స్​లో భారీవర్షం కురిసింది. వాననీటితో రహదారులు నిండిపోయాయి. రాంనగర్​లోని స్ట్రీట్ నంబర్ 17లో వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. చివరకు స్థానిక యువకుడు ప్రణీత్, అతడి స్నేహితులు రిస్క్ చేసి కారును గోడ పక్కకు తెచ్చారు. అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఈఎస్ఐ, సనత్​నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్​లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రోడ్లపై వర్షపు నీరు వరదలా మారింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీళ్లలో ఒక కారు కొట్టుకుపోయింది. స్థానికులు కారును ఆపాలనుకున్నా దూసుకువస్తున్న వరదను చూసి కారును చేరుకునే సాహసం చేయలేదు.

అవసరమైతేనే బయటకు రండి :భారీవర్షం కురవడంతో జీహెచ్​ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలు ఇళ్ల నుంచి రావొద్దని జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి హెచ్చరికలు జారీచేశారు. మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అత్యవసరసమైతే తప్పా ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని సూచించారు. వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే 040-21111111, 9000113667 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - ఆయా జిల్లాలకు భారీ వర్ష సూచన

Last Updated : Jul 14, 2024, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details