AP Rain Alert :నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటితోందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు:ఈ వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది శ్రీలంకలోని ట్రికోమలీకి ఉత్తర ఈశాన్యముగా 270, నాగపట్టణానికి తూర్పుగా 300, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా కదిలి, బలపడి రానున్న 6 గంటల్లో తుపానుగా మారె అవకాశం ఉందని తెలిపారు.
"అలర్ట్" మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం