ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌- కార్యకలాపాలు ఏప్రిల్‌ ఒకటి నుంచే - RAILWAY ZONE OPERATIONS STARTS

కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి కనీసం రెండు, మూడేళ్లు - తాత్కాలిక భవనాల్లో విధులు నిర్వహించేందుకు వీలు

railway_zone_operations_will_start_from_april
railway_zone_operations_will_start_from_april (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 10:03 AM IST

Railway Zone Operations Will Start From April : విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆరంభించేలా చూడాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ముడసరిలోవ వద్ద కేటాయించిన భూముల్లో జోన్‌ భవనాల నిర్మాణం పూర్తయ్యాక అప్పుడు జోన్‌ విధులు మొదలుపెట్టాలనుకుంటే, తీవ్ర జాప్యం జరుగుతుంది. ఆ భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి కనీసం రెండు, మూడేళ్లు పడుతుంది. అంతవరకు ఆగాల్సిన అవసరం లేదని స్థానికులు, నిపుణులు చెబుతున్నారు.

గతనెల 8న విశాఖ జోన్‌ కార్యాలయాల నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈనెల 7న ఈ జోన్‌కు కేంద్ర మంత్రివర్గం పోస్ట్‌ ఫ్యాక్టో అప్రూవల్‌ (నిర్ణయానంతర ఆమోదం) తెలిపింది. దీంతో వెంటనే జోన్‌ కార్యకలాపాలు తాత్కాలిక కార్యాలయాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆరంభిస్తే విశాఖ జోన్‌ కల సాకారమవుతుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలి. అవసరమైతే ఒత్తిడి తీసుకురావాలి.

గతంలో ఇలా

  • భువనేశ్వర్‌ కేంద్రంగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ 2003 వస్తే అక్కడ శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ఆగలేదు. అందుబాటులో ఉన్న రైల్వే క్వార్టర్లు, ఇతర భవనాలు, రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన భవనాల్లో తాత్కాలిక జోన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు ఆరంభించారు. జోన్‌ సొంత కార్యాలయాలు సిద్ధమయ్యే వరకు (నాలుగైదేళ్లు) వీటిలోనే విధులు నిర్వహించారు.
  • సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ విషయంలోనూ ఇదే జరిగింది. 1966లో తొలుత తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ఆరంభించారు. 1972 నాటికి జోన్‌ సొంత భవనాలు అందుబాటులోకి వచ్చాయి.
  • గుంటూరు డివిజన్‌ ఏర్పాటైనప్పుడు కూడా ఇంతే. గుంటూరు రైల్వే స్టేషన్‌ మొదటి ప్లాట్‌ఫాంలోని పై అంతస్తులో ఉన్న రిటైరింగ్‌ రూముల్లోను, ఏడో ప్లాట్‌ఫాంలో ఉన్న ఆర్‌పీఎఫ్‌ బ్యారాక్స్‌లోనూ తాత్కాలిక డీఆర్‌ఎం కార్యాలయాలు, ఇతర విభాగాలు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు ఆరంభించారు. తర్వాత కొన్నేళ్లకు సొంత భవనాలు సమకూరాయి.

అందుబాటులో భవనాలు

విశాఖ జోన్‌ ఆరంభించాలంటే జీఎం కార్యాలయంతోపాటు, పది విభాగాల అధిపతుల కార్యాలయాలు, వారి సిబ్బంది పని చేసేందుకు సదుపాయాలు అవసరం.

  • విశాఖలో ప్రస్తుతమున్న డీఆర్‌ఎం కార్యాలయాన్ని జోనల్‌ కార్యాలయంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉంది. అక్కడ 11,536 చ.మీ. విస్తీర్ణం అందుబాటులో ఉంది.
  • డీఆర్‌ఎం కార్యాలయానికి సమీపంలో 2,872 చ.మీ. విస్తీర్ణం కలిగిన కొత్త కార్యాలయ భవనం సిద్ధంగా ఉంది.
  • ట్రైనింగ్‌ స్కూల్‌కు చెందిన 3 వేల చ.మీ. మరో భవనాన్ని వాడుకోవచ్చు.
  • అలాగే డీఆర్‌ఎం బంగ్లాకు సమీపంలో ఉన్న పాత రైల్వే నిలయం భవనం అందుబాటులో ఉంది. రైల్వే స్టేడియం ఎదురుగానూ, బీచ్‌ రోడ్డులోనూ ఉన్న విశ్రాంత గృహాలు, జ్ఞానాపురం, తాటిచెట్లపాలెం, డీఆర్‌ఎం కార్యాలయానికి సమీపంలో అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి.
  • విశాఖలో రైల్వేకు క్రీడా, వాణిజ్య భవనాలు ఉన్నాయి.
  • ప్రస్తుతానికి జీఎం నివాసం, కార్యాలయ అవసరాల కోసం నగరంలో రెండు భవనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్‌కే బీచ్‌లోని ఈస్టుపాయింటు రెస్ట్‌ హౌస్, డీఆర్‌ఎం బంగ్లా ఉన్నాయి.
  • ఆర్టీసీ ద్వారకా బస్టాండ్‌పైన కొన్ని అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు భవనాలను కేటాయించేందుకు సిద్ధంగా ఉంది.

గుడ్ న్యూస్ - విశాఖ కేంద్రంగా సౌత్​ కోస్ట్​ రైల్వే జోన్​ - కేంద్ర కేబినెట్ ఆమోదం

అధికారుల సర్దుబాటుకు వీలు :ప్రస్తుతం జోన్‌ నిర్వహణకు ఒక జనరల్‌ మేనేజర్‌ (జీఎం), ఏజీఎం క్యాడర్‌లో 13 మంది, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ (ఎస్‌ఏజీ) 30 మంది, జేఏజీలు 45 మంది, సీనియర్, జూనియర్‌ స్కేల్‌లో అధికారులు 81 మంది ఉంటే సరిపోతారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో పాటు 40 మంది గెజిటెడ్‌ అధికారులు కావాలి.

  • సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఎస్‌ఈలు, జేఈలు 700, మినిస్టీరియల్‌ స్టాఫ్‌ 380, లెవెల్‌-1 స్టాఫ్‌ 120 మంది ఉండాలి.
  • డీఆర్‌ఎం కార్యాలయ పరిధిలోని అధికారులతోపాటు, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి కొందరిని సర్దుబాటు చేసుకుంటే తాత్కాలికంగా కార్యాలయాలు ఆరంభించవచ్చు.

ఎంపీలు దృష్టిపెట్టాల్సిన అంశాలివి :ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దక్షిణ కోస్తా జోన్‌ కార్యకలాపాలు ఆరంభమయ్యేలా చూసేందుకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలు కొన్ని కీలక అంశాలపై దృష్టిసారించాలి.

  • ఇప్పటికే జోన్, విశాఖపట్నం డివిజన్‌కు సంబంధించిన తుది డీపీఆర్‌ను ప్రత్యేక అధికారి సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపారు.
  • కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్‌కు చెందిన డీపీఆర్‌ను వారం, పది రోజుల్లో రైల్వేబోర్డుకు పంపేందుకు అధికారులు సిద్ధంచేస్తున్నారు.
  • ఈ డీపీఆర్‌లను రైల్వే బోర్డు వేగంగా ఆమోదించేలా చూడాలి.
  • ఆ తర్వాత కొత్త జోన్‌ ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్‌ ప్రచురించి, ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు అందులో పేర్కొనేలా చూడాలి.
  • అనంతరం జోన్‌కు జీఎంను నియమిస్తే ఆ తర్వాత ఇతర అధికారుల నియామకాలు చకచకా జరిగిపోతాయి.

కేంద్రం గుడ్​న్యూస్ - దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధి ఖరారు - డివిజన్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details