IRCTC Tourism Package :దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొలువైన సప్త జ్యోతిర్లింగాలను శ్రావణ మాసంలో దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఆ మహాత్ భాగ్యాన్ని కల్పిస్తోంది రైల్వేశాఖ. సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర పేరిట ప్రత్యేక ఆధ్యాత్మిక రైలును ఏర్పాటు చేసింది. ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పుణె, నాసిక్, ఔరంగబాద్‌లో వెలసిన సప్త లింగాలను దర్శించుకునేలా ఈ టూరిజం ప్రత్యేక రైలు నడుస్తుంది. దేశంలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రజలకు సందర్శన భాగ్యం కల్పించడం తద్వారా ఆయా క్షేత్రాలను అభివృద్ధి చెందించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్ల పేరిట ఏడాది నుంచి భారతీయ రైల్వే ఈ తరహా రైళ్లను నడుపుతోంది.
ఈ నెల 17 న రాత్రి 9 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరే ఈ రైలు మార్గ మధ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల వద్ద ఆగి యాత్రికులను ఎక్కించుకుని సికింద్రాబాద్ మీదుగా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తుంది. ఈ నెల 17న యాత్ర మొదలై 28 వరకు యాత్ర కొనసాగనుంది. 12 రోజుల పాటు నడిచే రైలు లో స్లీపర్, ధర్డ్ ఎసీ, సెకండ్ ఎసీ బోగీలను ఏర్పాటు చేశారు. 716 మంది యాత్రికులతో వెళ్లే ఈ రైలులో ఏ చిన్న ఇబ్బంది లేకుండా సకల సదుపాయాలను కల్పించినట్లు IRCTC ఉన్నతాధికారులు తెలిపారు. అతి తక్కువ టికెట్ ధరలోనే అన్ని సదుపాయాలు కల్పించి సప్తలింగాలను భక్తులు దర్శించుకునే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎకానమీ కేటగిరిలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.20,590 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు.