Radisson Drugs Case Updates : గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్ డగ్స్(Radisson Drug Case) వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వివేకానంద్‌కు బెయిల్ రాగా కేదార్, నిర్భయ్‌లను పూచీకత్తుపై పోలీసులు వదిలిపెట్టారు. మరోవైపు ఎఫ్‌ఐఆర్‌లో ఏ10గా నమోదైన క్రిష్‌ను పోలీసులు విచారణకు పిలిచారు. తాను ముంబైలో ఉన్నానని, శుక్రవారం విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, వివేకానంద్‌కు డ్రగ్స్ సరఫరా(Drugs) చేసిన అబ్బాస్ అలీ జఫ్రీను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అబ్బాస్ అలీని 24 గంటలకు పైగా విచారించిన పోలీసులు, పలు కీలక విషయాలతో సహా ఆధారాలు సేకరించారు. అబ్బాస్ అలీని కూకట్‌పల్లి మెట్రో పాలిటన్ కోర్టుకు తరలించిన పోలీసులు కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ వేసే అవకాశం ఉంది. కాగా అబ్బాస్ అలీని విచారించే క్రమంలో తన నుంచి డ్రగ్స్ తీసుకుని వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్, వివేకానంద్‌కు చేరవేస్తున్నట్టు చెప్పడంతో అతణ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సోమవారం రోజున వివేకానందను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కోర్టు సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. వివేకానంద్ స్నేహితులు నిర్భయ్, కేదార్‌లకు స్టేషన్ బెయిల్ మంజూరైంది. వివేకానంద్, కేదార్, నిర్భయ్‌లు అరెస్ట్ అయిన సమయలో వారి ఫోన్ డేటాను ఎరేజ్ చేయగా, దానిని రీట్రైవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు యువతులు సహా మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.