Quartzite Mining Affecting Public Health: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో క్వార్ట్ జైట్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ ఖనిజానికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిని తవ్వుకుని ఎంతో మంది కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో పదికి పైగా ఇలాంటి మైనింగ్‌లు ఉన్నాయి. ఇందులో పనిచేసే కార్మికులు ఇప్పటికే 20 మందికి పైగా మరణించారు. దీంతో స్థానిక ప్రజలు పనికి వెళ్లటం మానేశారు. దీంతో పలు మైనింగ్‌లు మూతపడ్డాయి. ప్రస్తుతం 3 మాత్రమే పని చేస్తున్నాయి. వాటిలోనూ ఇతర రాష్ట్రాల వారు మాత్రమే పని చేస్తున్నారు. కానీ ఓర్వకల్లులో క్వార్ట్‌జైట్ మైనింగ్ కోసం సమర్పించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలు కాలుష్యాన్ని కప్పిపుచ్చేలా, ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయి.
క్వార్ట్‌జైట్ తవ్వకాలు, రవాణాతో వెలువడే ధూళి కాలుష్య మోతాదును ఈ నివేదికల్లో కనీస స్థాయిలో చూపించారు. ఆ గణాంకాలను ఎలా లెక్కించారో స్పష్టతివ్వలేదు. ఈ గనుల్లో పనిచేసే కార్మికులపై మైనింగ్ నుంచి వచ్చే ధూళి ప్రభావం ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు. వాస్తవానికి, క్వార్ట్‌జైట్ మైనింగ్‌తో చెలరేగే ధూళిలో 90 శాతానికిపైగా సిలికాన్ డై ఆక్సైడ్ ఉంటుంది. ఇది కార్మికుల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతుంది. ఈఐఏఆర్‌లో మాత్రం క్వార్ట్‌జైట్ కాంపోజిషన్ వివరాలే ఇవ్వలేదు.
ఈ మైనింగ్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తక్కువగా చూపిస్తూ, అరకొర సమాచారంతో షిర్డీసాయి సంస్థ నివేదికలు సమర్పించగా, కాలుష్య నియంత్రణ మండలి వాటినే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. వీటి ఆధారంగానే సెప్టెంబరు 6వ తేదీన ఓర్వకల్లులో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2022లో ఓర్వకల్లులోని 42.05 హెక్టార్లలో మూడు క్వార్ట్‌జైట్ గనుల లీజుల్ని 20 ఏళ్ల కాలపరిమితితో షిర్డీసాయి సంస్థ దక్కించుకుంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలు - కొనసాగుతున్న విచారణ - Illegal Minerals Mining in AP