DJs Selling Drugs in Hyderabad Pubs :హైదరాబాద్‌లోని కొన్ని పబ్బులు డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులకు కేంద్రంగా మారుతున్నాయి. మద్యం మత్తులో సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఏర్పాటు చేస్తున్న పబ్బులు, మాదకద్రవ్యాల దందాకు కేంద్ర బిందువుగా తయారయ్యాయి. కొంతకాలంగా మత్తు పదార్థాల వినియోగదారులు, డ్రగ్ పెడ్లర్లు తరచూ పబ్బుల్లో చిక్కుతున్నారు. పబ్బులను కేంద్రంగా చేసుకోని అమ్మకాలు జరుగుతుండటం వివాదాస్పదమవుతోంది.
తాజాగా ఖాజాగూడలోని ది కేవ్ పబ్‌లో డ్రగ్స్, గంజాయి తీసుకునేవారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో డ్రగ్స్ వాడిన 24 మంది చిక్కడం గమనార్హం. 20 రోజుల క్రితం మాదాపూర్‌లోని పబ్బులో ఓ డీజే మాదకద్రవ్యాలు తీసుకుని పోలీసులకు దొరికిపోయాడు. గత మూడు వారాల్లో నమోదైన రెండు డ్రగ్స్ కేసులు కూడా పబ్స్ కేంద్రంగా ఉండటం ఈ పరిస్థితిని తెలుపుతుంది.
డీజేలదే ప్రధాన పాత్ర పబ్బుల్లో పనిచేసే డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు టీజీన్యాబ్ పోలీసులు గుర్తించారు. నగరంలో వందకుపైగా పబ్బులు ఉన్నాయి. దీంతో డీజేలకు విపరీతంగా డిమాండ్ ఉంది. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలకు పబ్బుల యజమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్లతో డ్రగ్స్ సరఫరా ముఠాలు, నైజీరీయన్లతో సంబంధాలు నెరుపుతున్నారు. ఈవెంట్లకు వేర్వేరు నగరాలకు తరచూ వెళ్లే డీజేల్లో కొందరు పబ్బుల్లో పరిచయమయ్యేవారికి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు.
ఈ శనివారం అర్ధరాత్రి ది కేవ్ పబ్‌లో, జూన్ 16న మాదాపూర్‌లోని ఒక పబ్‌లో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు డీజేలు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ఐదు పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తున్న ఇద్దరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు టీజీన్యాబ్ పోలీసులు గుర్తించారు. పబ్బుల నిర్వాహకులు, యజమానులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడ్డ కొందరు పోలీసుల నిర్లక్ష్యంతోనే వారి ఆగడాలను అరికట్టడం లేదంటూ విమర్శలున్నాయి.