Public in Panic Due to Leopard Wandering in Telangana :వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొందరు సంపాదన కోసం అక్రమంగా విరివిగా అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో వాటికి ఆవాసాలు లేక అడవిలో ఉండాల్సిన జీవాలు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి ప్రజలు, పశువులపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుత, పెద్దపులి, ఎలుగుబంటి సంచారం, దాడులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Leopard Hulchul in Nirmal District: నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సారంగపూర్ మండలం రవీంద్రనగర్ సమీపంలో సహ్యాద్రి కొండల వద్ద ఓ వ్యక్తి మేకలను కాసేందుకు వెళ్లాడు. మేకలు మేత మేస్తుండగా అతడు ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిరుత అతని వైపు వస్తుండడాన్ని గమనించి మేకల కాపరి కేకలు వేస్తూ వెంటనే చెట్టెక్కాడు. అతడు బిగ్గరగా కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది. అయితే, అంతకంటే ముందే ఆ క్రూరమృగం రెండు మేకలను చంపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Leopard Wanders in Khammam District : మరోవైపు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ సమీపంలోని మిరప తోటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. మిరప తోటలో చిరుత సంచరిస్తుండగా చూసిన అక్కడ పనిచేసే యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తల్లాడ రేంజ్ అధికారి శ్రీనివాస రావు తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.