Every Day India Photo Exhibition in Hyderabad : దేశమంటే మతం రాజకీయమే కాదని, మట్టి, మనుషులు కూడా అని చెప్పడానికి ఎవ్రీ డే ఇండియా పేరుతో ఫొటోగ్రఫీ షో ప్రారంభించామని ప్రముఖ జర్నలిస్టు ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు అన్నారు. హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎవ్రీ డే ఇండియా పేరిట ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, తదితరులు పాల్గొన్నారు.
సామాన్యుల నిత్య జీవితాన్ని అందరికీ తెలిసే ఉద్దేశంతో 60 ఫొటోలను హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచామని రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రదర్శన ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం కథలు, నవలలు రాసేవారు ఉన్నారని, కానీ ఫొటోగ్రఫీ ద్వారా కథ రాసేది మాత్రం చాలా అరుదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
'మనుషుల అనుభవాలు ముఖాల్లో కనిపిస్తున్నాయి. వాళ్ల భావోద్వేగాలు కూడా ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూడగానే చెప్పదల్చుకున్న వివరణ, విషయం అవసరం లేకుండా అర్థమవుతోంది. ఛాయాచిత్రాలు చాలా బాగుంది'-ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు