Kodandaram and Amir Ali Khan sworn in as MLCs :గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ప్రమాణం చేశారు. మండలి సభ్యుల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించడంతో ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. ఈ మేరకు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించారు.
మండలి ఛైర్మన్ ఛాంబర్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Professor Kodandaram Speech After MLC Sworn : తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని ఆచార్య కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని అన్నారు. అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు.
"ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండా మీదకు తీసుకురాగలిగాను. మండలిలో సభ్యులుగా కావడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యతతో ఉద్యమకారుల, ప్రజల, అమరుల ఆకాంక్షల మేరకు పని చేస్తాను. అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ద్ధించింది. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే మాకు ఈ గుర్తింపు దక్కింది." -కోదండరాం, ఎమ్మెల్సీ