ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జేబు కొట్టేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ - పండుగ వేళ ప్రయాణికులకు షాక్ - PRIVATE TRAVELS BUS TICKET PRICES

ప్రైవేటు ట్రావెల్స్ టిక్కెట్ల ధరలు నాలుగింతలు పెంపు - ఆర్టీఏ అధికారుల ఎక్కడ?

private_travels_bus_ticket_prices
private_travels_bus_ticket_prices (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2025, 12:18 PM IST

Private travels bus ticket prices :సంక్రాంతి పండగ వేళ ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణ చార్జీలను అమాంతం పెంచేశాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్‌ దృష్ట్యా ఈ అవకాశాన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ సొమ్ముచేసుకుంటున్నాయి.

'సంక్రాంతికి వస్తున్నాం' - 'ఓ సామాన్యుడి స్టోరీ' చదివేయండి!

సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి జేబు గుల్ల చేస్తూ ప్రైవేటు బస్సులు టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేశాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు తిప్పుతున్నా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తూ ప్రయాణికులను దోచేస్తున్నారు. పండగ సమీపించే కొద్దీ టికెట్‌ ధరలను మరింతగా పెంచుతూ పోతున్నారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే దానికన్నా మూడింతలు అధికంగా వసూలు చేస్తున్నారు. మరి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ నాలుగు రెట్లు ధరలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

సంక్రాంతిని ఏపీలో ఘనంగా నిర్వహించుకుంటారు. మూడు రోజుల పెద్ద పండగ కావడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం స్వస్థలాలకు వస్తుంటారు. ఈ క్రమంలో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ట్రావెల్స్‌ టిక్కెట్ల దందా, ఇతర ఉల్లంఘనలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నా, అదనపు సీట్లు, కాంట్రాక్ట్‌ క్యారేజీ పర్మిట్లు తీసుకుని స్టేజ్‌ క్యారేజీలుగా తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ నిబంధనల అతిక్రమణలపై ప్రభుత్వం కఠినంగా ఉంటేనే ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు గుడ్​న్యూస్ - సంక్రాంతికి మరికొన్ని స్పెషల్ ట్రైన్స్

డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు

విజయవాడలో పలు ప్రైవేటు ట్రావెల్స్‌ ఏజెన్సీలకు చెందినవి 200 పైగా బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తదితర ప్రాంతాలకు వీటిని నడిపిస్తున్నారు. ఏసీ, నాన్‌ ఏసీ, స్లీపర్‌, ఏసీ స్లీపర్ సర్వీసులకు ఎక్కువగా డిమాండ్ ఉంది. విజయవాడ మీదుగా నిత్యం 300 బస్సులు ట్రిప్పులు నడుస్తుండగా శని, ఆదివారాలు మినహా సాధారణ రోజుల్లో డిమాండ్‌ తక్కువగా ఉంటుంది. ఇక పండగ సీజన్‌లోనే ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వారం రోజులకు పైగా సెలవులు వచ్చాయి. మరోవైపు హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖ, చెన్నై, తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చే వారు కూడా ఎక్కువే. పండగకు రావడంతో పాటు తిరిగి వెళ్లే మూడు రోజులు కూడా రద్దీ అధికంగానే ఉంటుంది. ఈ నెల 11 నుంచి డిమాండ్‌ కనిపిస్తుండగా తిరుగు ప్రయాణాలకు 19న ఎక్కువ గిరాకీ ఉంది.

  • హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే రూట్‌లో ఏసీ, నాన్‌ఏసీ, స్లీపర్‌ బస్సుల్లో టిక్కెట్ల ధరలు కొండెక్కాయి.
  • నాన్‌ - ఏసీ బస్సుల్లో ఆర్టీసీలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర రూ.450 కాగా, ప్రైవేటు బస్సుల్లో రూ.1,500-3,000 తీసుకుంటున్నారు.
  • మల్టీ యాక్సిల్‌ సర్వీసుల్లో ఆర్టీసీ కంటే 3 నుంచి 4 రెట్లు ధరలు పెంచేశారు. ఏసీ స్లీపర్‌ టిక్కెట్ ధర సాధారణ రోజుల్లో రూ.2,000 కాగా, ప్రస్తుతం 3,800కు పెంచారు.
  • ఏసీ సర్వీసుల్లో సీటింగ్‌ టిక్కెట్‌ రూ.2,500 ఉండగా విశాఖ వెళ్లే బస్సుల్లో ఆర్టీసీ కంటే మూడు రెట్లు దండుకుంటున్నారు. ఏసీ స్లీపర్‌కు 4వేలకుపైనే, నాన్‌ ఏసీ సీటింగ్‌ రూ.1,600-2,400 బాదేస్తున్నారు.
  • బెంగళూరు మార్గంలో ఏసీ సీటింగ్‌ టిక్కెట్ ధర రూ.3,000-4,500గా నిర్ణయించారు.

రైలు ఎక్కలేం, బస్సును భరించలేం - ప్రైవేటు ఛార్జీ తెలిస్తే నోరెళ్లబెడుతారు!

​ఆర్టీసీ శుభవార్త : అదనపు ఛార్జీల్లేకుండానే 'సంక్రాంతి' స్పెషల్​ బస్సులు

ABOUT THE AUTHOR

...view details