PrasadsMultiplex stops screening Pushpa 2 The Rule Movie :సినీ ప్రముఖులు, హైదరాబాద్ వాసులకు ఎంతో ఇష్టమైన సినిమా థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందుంటుంది. ఇందులో సినిమాని చూసేందుకు, సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో విడుదలైన ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule)ను ఈ మల్టీప్లెక్స్‌లో చూడాలని ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమాను తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి : సినీ అభిమానులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా సుమారు రెండు దశాబ్దాల నుంచి తాము పని చేస్తున్నామని ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ తెలిపింది. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో పుష్ప 2 సినిమాని ప్రదర్శించలేకపోతున్నామని వెల్లడించింది. సినీ ప్రేమికులకు నిరాశ కల్పించినందుకు తాము చింతిస్తున్నామని పేర్కొంది. తమను అర్థం చేసుకుంటారని అలానే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే సినిమాను ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం తెలపలేదు. ప్రస్తుతం ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.