Expert Teachers Tips to Get 10 out of 10 in 10th Class :ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తుకు వారధి వంటిది పదో తరగతి. ఇంతటి ముఖ్యమైన పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి షురూ కానున్నాయి. ఇందులో విజేతగా నిలిచి మంచి భవితను పదిల పర్చుకునేందుకు చేతిలో ఉన్న ఈ కొద్ది రోజులు ఎంతో కీలకం. సిలబస్ మారినందున విద్యార్థులు అవగాహనతో ప్రణాళికాయుతంగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సబ్జెక్టు నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుల సూచనలు, సలహాలను పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఈటీవీ భారత్ అందిస్తోంది.
ఇలా చేస్తే భౌతికశాస్త్రంలో మార్కులు సులభం :
- అర్థం చేసుకుంటే భౌతిక శాస్త్రంలో మార్కులు సులభం.
- బ్లూ ప్రింట్ ఆధారంగా చదివితే 50కి గరిష్ఠంగా 40 మార్కులు సాధించొచ్చు. ప్రతి పాఠాన్ని క్షుణ్నంగా చదివి కీలక అంశాలు నేర్చుకుంటే 50కి 50 మార్కులు సాధించొచ్చు.
- మొత్తం 17 ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి 8 వరకు ఒక మార్కువి, 9, 10, 11కు రెండు, 12, 13, 14కు నాలుగు, చివరి మూడు ప్రశ్నలు 8 మార్కులవి ఉంటాయి. వాటిని బట్టి పరీక్షలకు సిద్ధం కావాలి.
- భౌతికశాస్త్రంలో నాలుగు, రసాయన శాస్త్రంలో నాలుగు పాఠాలున్నాయి.
- ఐచ్ఛికం (ఛాయిస్)తో కలుపుకొని ఫిజిక్స్ నుంచి 39 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 39 మార్కులకు ప్రశ్నలిస్తారు. ఐచ్ఛికం 28 మార్కులకు మినహాయిస్తే మిగిలిన యాభైకి పరీక్ష రాయాలి. ఇందుకు హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి లోపాలు, విద్యుత్తు, డీసీ జనరేటర్ పని చేసే విధానం, నూతన ఆవర్తన పట్టిక నిర్మాణం, కెమికల్ రియాక్షన్, ఎండమావులు, ఇంధ్రధనుస్సు ఏర్పడే విధానం, ఈక్వేషన్స్, మెటల్స్, నాన్ మెటల్స్ పాఠాలపై దృష్టిపెట్టాలి.
ఆంగ్లం - అవసరం వరుస క్రమం
- ఇంగ్లీష్‌లో ఈ ఏడాది ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న మార్పులతో ప్రశ్నపత్రం పాత విధానంలోనే ఉంటుంది.
- మొత్తం మూడు పార్ట్స్ ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ఇచ్చిన ప్రశ్నలను అర్ధం చేసుకొని సమాధానాలు రాస్తే 30కి 30 మార్కులు పొందొచ్చు.
- రెండో విభాగంలోని వకాబులరీ, గ్రామర్ ఎడిటింగ్‌కు సంబంధించిన వర్క్‌బుక్‌లో పాసేజెస్ సాధన చేయాలి. ఈ విభాగంలో ప్రశ్నలన్నింటికీ వరుస క్రమంలో సమాధానాలు రాయాలి.
- మూడోది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, లెటర్ రైటింగ్‌పై దృష్టి సారించాలి. చేతిరాత, అన్ని ప్రశ్నలకు జవాబులు వరుస క్రమంలో రాయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
చాప్టర్లను ఎక్కువసార్లు అభ్యసనం చేస్తే గణతంలో 100 మార్కులు :
- ఎస్‌సీఆర్‌టీ రూపొందించిన మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేస్తే గణితంలో ఉత్తీర్ణత కష్టమేమీ కాదు.
- సి, డి గ్రేడ్ విద్యార్థులు బ్లూప్రింట్‌ను గమనించి సులభమైన చాప్టర్లను ఎక్కువసార్లు అభ్యసనం చేస్తే మార్కులు సులభం.
- కరణులు, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత, గ్రాఫ్ పూర్తిగా నేర్చుకోవాలి.
- బహుపదులు, శూన్య విలువలు కనుగొనుట, మూలాల స్వభావం, కోఆర్డినేట్ జామెట్రీలో మధ్య దూరం కనుగొనుట, త్రికోణీయ నిష్పత్తుల పాఠాలను ప్రత్యేకంగా చదవాలి.
జీవశాస్త్రంలో అవి గుర్తు పెట్టుకోవడం అవసరం :
- జీవశాస్త్రం విద్యార్థులకు ఎంతో సులభమైన ఇష్టమైన సబ్జెక్టు. సైన్స్‌లో రెండో పేపర్‌గా ఉంటుంది.
- మొత్తం 50 మార్కుల్లో అత్యధికంగా పొందడానికి వీలుంది. ఇందుకుగాను మానవ విసర్జన, పుష్ప నిర్మాణం, మానవ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవ లింగ నిర్ణయం చిత్రాలు బాగా సాధన చేయాలి. కిరణ జన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరం, పిండి పదార్థాలపై లాలాజల చర్య, రైజోపస్ ప్రయోగాలను వివరంగా తెలుసుకోవాలి. పట్టికలు, పేరాగ్రాఫ్ ప్రశ్నలపై దృష్టిపెట్టాలి. భేదాలు, కారణాలు, నిర్వచనాల ప్రశ్నలను సాధన చేయాలి. డయాఫ్రంల సాధన, ఫ్లోచార్ట్స్ గుర్తుపెట్టుకోవడం అవసరం.