Prakasam District SP Damodar inquired Doctor Prabhavathi In Raghu Rama krishna Case : రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A5గా ఉన్న డాక్టర్ ప్రభావతిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. రఘురామపై పోలీస్ కస్టడీలో హత్యాయత్నం చేశారంటూ నమోదైన కేసుపై ఆయన విచారణ చేపట్టారు. నివేదిక తారుమారు చేయడానికి గల కారణాలేమిటని ఆమెను ప్రశ్నించారు. గాయాలతో ఆస్పత్రికి వచ్చిన రఘురామకు చికిత్స చేశారా అని అడిగారు.
గాయాలు లేవని ఎలా నిర్ధారించారు, ఎందుకు నిర్ధారించారని ప్రభావతిని ప్రశ్నించారు. అప్పట్లో పోలీసుల దాడిలో గాయపడ్డ రఘురామకృష్ణరాజును (Raghu Rama Krishnam Raju) గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి ఆస్పత్రి పర్యవేక్షుకురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతి ఎలాంటి గాయాలు లేవని నివేదికలు ఇచ్చారు.
దీంతో ఇప్పుడు ప్రభావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు ప్రయత్నించగా ఆమె గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లి అరెస్ట్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించుకున్నారు. పోలీసుల (Police) విచారణకు సహకరించాలని ప్రభావతికి సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఆమె ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రఘురామ హత్య వెనక ఉన్న కుట్ర గురించి మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు యత్నించారు.