ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్‌లకు, మరో ముగ్గురికీ ప్రభుత్వం పోస్టింగ్ Postings To IAS Officers Transferred By Ec: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేసిన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. తిరుపతి కలెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీశను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా కీలకమైన పోస్ట్‌లో ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన పీ.రాజబాబుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా పోస్టింగ్ ఇచ్చింది. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన ఎం. గౌతమి టీటీడీ జేఈఓగా నియమితులయ్యారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో సస్పెండైన ఐఏఎస్ అధికారి గిరీషాపైనా సస్పెన్షన్ వేటు ఈసీ తొలగించింది.
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌లు బదిలీలు - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
CEC Transferred IAS and IPS Officers: మూడు జిల్లాల కలెక్టర్లపై వివాదాస్పద అధికారులుగా ముద్రపడటంతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీవేటు వేసింది. ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. వారితో పాటు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న బి.ఆర్.అంబేడ్కర్‌ను మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల పరిశుభ్రత కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా నియమించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె.వెంకటరమణారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్. ప్రభాకర్‌రెడ్డికి సీసీఎల్‌ఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐఏఎస్‌లు బదిలీ - సీఎస్ ఉత్తర్వులు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనేఆరోపణలపై ఇటీవలే ఎన్నికల కమిషన్ వేటుపడిన అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమికి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. తిరుపతి జిల్లా గాజులమండ్యం ప్రాంత వాసి అయిన గౌతమికి బంధుగణం కూడా ఇక్కడ ఉంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా టీటీడీ జేఈవోగా నియమించడం విమర్శలకు తావిస్తోంది. సొంత జిల్లాలో పోస్టింగ్ రావడానికి ప్రభుత్వంలోని ప్రధాన అధికారే కారణమని తెలుస్తోంది. ఆమెను ఎన్నికలతో నేరుగా సంబంధం లేని పోస్టులో నియమించినప్పటికీ బంధువర్గం ఈ జిల్లాలో ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయరెడ్డి తిరుపతి నుంచి పోటీ చేయటం, టీటీడీ ఉద్యోగుల ఓట్లన్నీ ఇక్కడే ఉన్న నేపథ్యంలో అధికారిణిగా తిరుపతి ఎన్నికల్లో ఆమె ప్రభావం చూపేందుకు ఆస్కారం ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్లు - పోలీసులపై సస్పెన్షన్ వేటు
మళ్లీ విధుల్లోకి కలెక్టర్ గిరీషా: అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ సస్పెండైన ఐఏఎస్ గిరీషాను మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇతనిపై సస్పెన్షన్ వేటును తొలగించింది. ఈ మేరకు ఈసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డులను డౌన్‌లోడ్ చేసి, వాటిని మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేసిన వ్యవహారంలో గిరీషాను ఈసీ జనవరిలో సస్పెండ్ చేసింది. దానిపై ఈసీకి ఆయన వివరణ ఇచ్చారు.ఆ సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న తనకు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పాత్రా లేదని, అప్పటికి నాలుగేళ్లుగా అక్కడ విధులు నిర్వహిస్తుండటంతో తనకు ఎన్నికల విధులు అప్పగించలేదని గిరీషా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్‌గా ఉన్న చంద్రమౌళీశ్వర రెడ్డి తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏఆర్‌ఓగా, తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఆర్‌ఓగా వ్యవహరించారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఈసీ ఎవరినీ నియమించలేదు. అప్పటి వరకు ఈఆర్‌ఓగా ఉన్న గిరీషాను తొలగించి ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించాల్సి ఉండగా, జిల్లా యంత్రాంగం నుంచి సమాచార లోపం వల్ల ఈసీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈసీ రికార్డుల్లో ఈఆర్‌ఓగా గిరీషా పేరే కొనసాగింది. చంద్రమౌళీశ్వరరెడ్డి తనంతట తానే ఈఆర్‌ఓగా బాధ్యతలు నిర్వహించేశారు. అప్పట్లో ఈఆర్‌ఓ లాగిన్ ఐడీ నుంచి పెద్ద ఎత్తున ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్ చేసిన వ్యవహారంలో చంద్రమౌళీశ్వర రెడ్డి ప్రమేయం ఉందని భావించిన ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్‌చేసింది. ఇప్పుడు గిరీషా వివరణతో సంతృప్తి చెంది ఆయనపై సస్పెన్షన్ తొలగించినట్టు తెలిసింది.