Poor Student Looking for Help to Study MBBS : డాక్టర్ కావాలనేదే అతని లక్ష్యం. చిన్నప్పటి నుంచి ఎవరు అడిగినా డాక్టర్ అవుతానంటూ చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉంటూ అన్నింట్లోనూ మంచి ఫలితాలు సాధించాడు. చివరగా తాను అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాడు. ఆ గ్రామంలో ఇప్పటివరకూ ఎవరూ వైద్య విద్యలో సీటు సాధించలేదు. కానీ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఆ ఘనత సాధించాడు. ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదువుతూ పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశాడు. ప్రస్తుతం తనకెంతో ఇష్టమైన వైద్య కళాశాలలో సీటు సాధించినా, వైద్య విద్య చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నాయి.
రోజూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అతని తల్లిదండ్రులు తమ కుమారుడి వైద్య విద్యకు సాయం అందించాలంటూ అర్థిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సుర్థేపల్లి గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వర్లు, సుశీల దంపతుల కుమారుడు శ్రీపతి. చిన్నప్పటి నుంచే చదువులో ఫస్ట్ ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. బోదులబండ హైస్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్కు అన్నపురెడ్డిపల్లిలోని గురుకుల కళాశాలలో సీటు దక్కింది. దీంతో అక్కడే ఇంటర్ చదివి 929 మార్కులు సాధించాడు. ఈ నేపథ్యంలో వైద్య విద్యకు ఖమ్మంలో శిక్షణ తీసుకుని ఇటీవలే వెల్లడైన నీట్-2024 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5,556, ఎస్సీ కేటగిరీలో 488వ ర్యాంకు సాధించాడు.