Governor Justice Abdul Nazeer Tribute to Ramoji Rao Demise :ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు మృతిపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని కొనియాడారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. రామోజీరావు తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారన్న జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Politicians Tribute to Ramoji Rao Demise : ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణంపై తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకై ప్రభుత్వాల మీద తన అక్షరమనే ఆయుధంతో పోరాటం చేసి యావత్ దేశ ప్రజల మన్ననలను పొందారని గుర్తు చేశారు.
అక్షరయోధుడు రామోజీరావు అస్తమయం పట్ల టీడీపీ సీనియర్ నేత కనక మేడల రవీంద్ర కుమార్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. పాత్రికేయ, సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారన్న కనకమేడల రామోజీ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.